కాసిపేట: మండలంలోని దేవాపూర్ మద్దిమాడ శివారులో ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. కాగా, తోటి సిబ్బంది భయంతో హత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని మరోచోట వేయడం వివాదాస్పదంగా మారింది. దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిమాడకు చెందిన కొడప కృష్ణ (28) గురువారం రాత్రి 9గంటల సమయంలో మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ట్రాక్టర్‌లో ఇసుక తీసుకువచ్చేందుకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు గ్రామస్తులు దిశ మోడల్ స్కూల్ పక్కన కృష్ణ మృతదేహం ఉన్నట్లు తెలుపగా భార్య స్వప్న, స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు. కృష్ణ తల, కాలు, నడుముకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు గుర్తించారు. రాత్రి ట్రాక్టర్‌లో ఇసుక నింపుకొని మద్దిమాడ వైపు వస్తుండగా 11గంటల సమయంలో డ్రైవర్ పోశం ట్రాక్టర్‌ను అజాగ్రత్తగా, అతివేగంగా నడపడంతో బోల్తా పడింది. దీంతో కృష్ణ తల, నడుముకు గాయాలు కావడంతో అక్కడే మృతి చెందాడు. భయపడ్డ డ్రైవర్ పోశం అతడి వెంట ఉన్న గంట రాజయ్య, చంద్రయ్య, అజయ్‌తో కలిసి సాక్ష్యాలను తారుమారు చేయాలని భావించాడు. దీంతో పోశం కృష్ణ మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం బైక్‌పై మృతదేహాన్ని తీసుకుని వెళ్లి దిశ మోడల్‌స్కూల్ పక్కన పడేశాడు. ఈ విషయమై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


