ఆదిలాబాద్‌రూరల్: విద్యుత్ షాక్‌తో అసిస్టెంట్ లైన్‌మెన్ మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు తాంసికి చెందిన అనిల్ పాటిల్ (35)భీంపూర్ మండలంలో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా చేస్తున్నాడు. బుధవారం భీంపూర్, భోరజ్ మండలాలకు సరఫరా అయ్యే 33 కేవీ విద్యుత్ తీగలు తెగిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ శాఖ ఉద్యోగులు తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. గురువారం మరమ్మతులు చేసేందుకు సంబంధిత అధికారులతో కలిసి అక్కడికి వెళ్లారు. అనిల్ పాటిల్ స్తంభంపైకి ఎక్కాడు. అయితే అక్కడ మూడు ప్రాంతాలకు సంబంధించిన 33 కేవీ ఫీడర్లు ఒకే చోట ఉన్నాయి. విద్యుత్ సరఫరా ఉన్న విషయాన్ని మృతుడు గమనించకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా మరో ఉద్యోగి చంద్రశేఖర్‌కు సైతం గాయాలయ్యాయి.


