చరిత్రకు సజీవ సాక్ష్యం సీఎస్‌ఐ చర్చి ఈ నెల 25, 26 తేదీల్లో ఏసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవం
లక్సెట్టిపేట: తెలంగాణ రాష్ట్రంలో మెదక్ తర్వాత రెండో పెద్ద చర్చిగా లక్సెట్టిపేట సీఎస్‌ఐ చర్చికి గుర్తింపు ఉంది. జిల్లాలోని చారిత్రక కట్టాడాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించనున్న ఏసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవ ప్రాంతీయ జాతరకు చర్చిని ముస్తాబు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి జాతరకు వచ్చే అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఆంగ్లేయుల కాలంలో నిర్మాణం..
1920లో ఇంగ్లాండ్‌కు చెందిన రెవసీజీ అర్లి దొర లక్సెట్టిపేటకు వచ్చాడు. ఏసుక్రీస్తు ఆరాధకుడు కావడంతో ఇక్కడ చర్చి నిర్మించాలనుకున్నాడు. ఇంగ్లాండ్ నుంచి రంగురంగుల అద్దాలు, గూడెం గుట్ట, గువ్వల గుట్ట, చిన్నయ్య గుట్టల నుంచి రాళ్ళు తెప్పించాడు. మహారాష్ట్ర నుంచి శిల్పకళాకారులను రప్పించాడు. లక్సెట్టిపేటకు సమీపంలో టేకు చెట్ల వనంలో మిషన్ కాంపౌండ్ ప్రాంతంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చి నిర్మాణ పనులు ప్రారంభించాడు. వేసవిలో వడదెబ్బకు గురికావడంతో స్వదేశానికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1935లో రివహెచ్‌బర్డ్ లక్సెట్టిపేటకు వచ్చి చర్చి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఇక్కడికి మిషనరీగా వచ్చిన రెవ ఫాస్పూట్ సీఎస్‌ఐ చర్చిగా నామకరణం చేసి ప్రారంభించారు. 86 వసంతాలు పూర్తి చేసుకున్నా ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
ఘనంగా ఏర్పాట్లు
జాతర ఏర్పాట్లను చర్చి కమిటీ సభ్యుడు ఫాదర్ డేవిడ్‌పాల్ చూసుకుంటున్నారు. 25న ఉదయం గ్రామాల్లో పర్యటించి అందర్నీ ఆహ్వానిస్తారు. సాయంత్రం ఊత్కూరు చౌరస్తా నుంచి భాజా భజంత్రీలతో పెద్ద ఎత్తున క్రైస్తువులు ర్యాలీగా చర్చి వద్దకు వస్తారు. 7 గంటలకు సిలువ వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేసి కీర్తనలు ఆలపిస్తారు. 26న ఉదయం నుంచి చర్చిలో కీర్తనలు ఆలపిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం సిలువ గుట్టపైకి వెళ్లి కొవ్వొత్తులు వెలిగిస్తారు.


