ఆర్టీసీలో సమాఖ్యల అద్దెబస్‌లు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో సమాఖ్యల అద్దెబస్‌లు

Apr 24 2026 6:38 AM | Updated on Apr 24 2026 6:38 AM

● మొదటి విడతలో 11 మంజూరు ● రెండో విడతలో ఐదు మండలాలకు

పాతమంచిర్యాల: స్వయం సహాయక సంఘాల బలోపేతానికి, సభ్యులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం వడ్డీలేని రుణాలు అందిస్తూ ఆర్థికంగా చేయూతనందిస్తోంది. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసిన ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు బస్సులను మంజూరు చేసింది. వాటిని అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి అప్పగించి ప్రతీనెల వచ్చిన ఆదాయాన్ని మండల సమాఖ్యల ఖాతాల్లో జమ చేయనుంది. జిల్లాలో 11 మండల సమాఖ్యలకు అద్దె బస్‌లు మంజూరుకాగా వాటిని పెద్దపల్లి జిల్లా మంఽఽథని డిపోకు 09, మంచిర్యాల, సిరిసిల్ల డిపోలకు ఒక్కో బస్సు చొప్పున కేటాయించారు. బస్సుల రిజిస్ట్రేషన్‌లు, హైపోతికేషన్‌ పూర్తి చేస్తున్నారు. మండల సమాఖ్యలకు ప్రభుత్వం విడుదల చేసే కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌తో బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగిస్తున్నామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు తెలిపారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.36 లక్షలు, నెలవారీ అద్దె రూ.69,468. ఆర్టీసీ, పేదరిక నిర్మూలన సంస్థల మధ్య అవగాహన ఒప్పందం ప్రకారం ఒక్కో బస్సుకు రూ.36 లక్షల చొప్పున 16 బస్సులకు రూ.5 కోట్ల 70 లక్షలు ఆర్టిసీకి చెల్లించారు. ఒక్కో బస్సుకు 7 సంవత్సరాల్లో 84 వాయిదాలలో మండల సమాఖ్యలకు ఆర్టీసీ అద్దె చెల్లించనుంది. 84 వాయిదాలు పూర్తయిన తర్వాత హైపోతికేషన్‌ రద్దు అవుతుందని అధికారులు తెలిపారు. కాగా జిల్లాలోని జన్నారం, కన్నెపల్లి, కాసిపేట, బెల్లంపల్లి, హజీపూర్‌, దండేపల్లి, మందమర్రి, కోటపల్లి, చెన్నూర్‌ భీమారం, జైపూర్‌ మండలాల మండల సమాఖ్యలకు బస్‌లు మంజూరయ్యయి, త్వరలోనే ఆయా డిపోలకు కేటాయించిన బస్‌లను డిపోల పరిధిలోని రూట్లలో నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా జిల్లాలో 16 మండలాలు ఉండగా 16 మండల సమాఖ్యలకు బస్‌లు ఇవ్వాలని నిర్ణియించింది. కానీ మొదటి విడతగా 11 బస్‌లు మంజూరు చేసింది. మరో ఐదు మండలాలు లక్సెట్టిపేట, భీమిని, నెన్నెల, తాండూరు, వేమనపల్లి మండల సమాఖ్యలకు కూడా బస్సులు మంజూరవుతాయని అధికారులు తెలిపారు.

ప్రక్రియ పూర్తి..

జిల్లాలో 16 మండల సమాఖ్యలకు సెర్ప్‌ ద్వారా బస్సుల మంజూరు ప్రక్రియ పూర్తయింది. బస్‌ల హైపోతికేషన్‌, రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత ఆయా డిపోలకు కేటాయించడం జరుగుతుంది. ప్రస్తుతం డిపోలకు బస్‌లు రాలేదు. డిపోలకు బస్సులు వచ్చిన తర్వాత నిర్ణీత రూట్లలో తిరుగుతాయి.

– ఎస్‌.కిషన్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

Advertisement
 
Advertisement
Advertisement