దండేపల్లి: మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటి వరకు 34 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఎక్కడ కూడా కాంటా వేయడం లేదు. మిల్లుల ట్యాగింగ్ ఇవ్వకపోవడంతో, కాంటాలు వేయడంలేదని నిర్వాహకులు పేర్కొంటున్నారు. దీంతో కొందరు రైతులు కొనుగోలు కేంద్రాల సమీపంలో, రోడ్ల పక్కన ధాన్యాన్ని ఆరబోయగా, మరికొందరు కుప్పలుగా పోసి ఉంచారు. ఉన్నట్టుండి గురువారం అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. రైతులు గుబులు చెంది ఆరబోసిన ధాన్యాన్ని కుప్పచేసి కవర్లు కప్పారు. అధికారులు స్పందించి వెంటనే మిల్లుల ట్యాగింగ్ ఇచ్చి కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ప్రారంభించి, తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై ఐకేపీ ఏపీఎం లక్ష్మీని సంప్రదించగా, మండలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ, మిల్లుల ట్యాగింగ్ ఇవ్వలేదు. దీంతో ఎక్కడ కూడా కాంటా వేయడం లేదు. ట్యాగింగ్ వచ్చిన వెంటనే కాంటాలు ప్రారంభించి, ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తామని చెప్పారు.


