నిషేధం..‘పత్తి’మాటే..! | - | Sakshi
Sakshi News home page

నిషేధం..‘పత్తి’మాటే..!

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

● జిల్లాకు చేరిన నిషేధిత విత్తనాలు! ● ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో పట్టివేత ● చర్యలు తీసుకుంటున్నా మారని తీరు

● జిల్లాకు చేరిన నిషేధిత విత్తనాలు! ● ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో పట్టివేత ● చర్యలు తీసుకుంటున్నా మారని తీరు

మంచిర్యాలఅగ్రికల్చర్‌/బెల్లంపల్లి: నిషేధిత పత్తి విత్తనం జిల్లాకు చేరుతోంది. ఇప్పటికే రహస్య ప్రాంతాల్లో అక్రమార్కులు క్వింటాళ్ల కొద్దీ నిల్వ చేసినట్లు తెలుస్తోంది. గతేడాది ఖరీఫ్‌ ఆరంభం జూన్‌లో ప్రభుత్వం పటిష్ట నిఘా ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుని అక్రమార్కులపై కేసులు నమోదు చేసింది. దీంతో ఈ ఏడాది అక్రమార్కులు ముందస్తుగానే సరఫరా చేస్తే తనిఖీలు ఉండవని భావించి దందాకు తెరతీసినట్లు తెలుస్తోంది. లూజు విత్తనాలను కిలోకు రూ.2,600 నుంచి రూ.3వేల చొప్పున రైతులకు అంటగడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలో రైతులు వేసవి దుక్కులు దున్ని ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్నారు. ఏటా ప్రభుత్వం నిషేధిత బీటీ–3 పత్తి విత్తనాల నివారణకు చర్యలు చేపడుతున్నా అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి. గ్రామాల్లో గైసిల్‌ విత్తనంగా పేరుగాంచిన గుర్తింపు లేని పత్తి విత్తన దందా జోరుగా సాగుతోంది.

ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి

ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి అక్రమార్కులు విత్తనాలు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ నెల 16న తాండూర్‌ మండలం బోయపల్లి బోర్డు వద్ద పోలీసులు 150 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని నలుగురిపై కేసు నమోదు చేశారు. వీరిపై ఇప్పటికే విత్తనాలు సరఫరా చేసినందుకు పీడీ యాక్టు నమోదై ఉండడం గమనార్హం. గత మంగళవారం మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను వేమనపల్లి మండలం ప్రాణహిత నదీ తీరం వద్ద అదుపులోకి తీసుకున్నారు. 50కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది జిల్లాలో 14 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని 17 కేసులు నమోదు చేసి 54 మందిని అరెస్ట్‌ చేశారు. కలుపు మందు పిచికారీ చేసినా ఎలాంటి నష్టం ఉండదని, కలుపు నివారణకు ఇబ్బంది రాదని, బుగ్గ పెద్దగా వస్తుందని మాయమాటలు చెబుతూ రైతులకు నిషేధిత విత్తనాలు అంటగడుతున్నారు. ఇలా రైతులు ఏటా మోసపోతున్నా కొందరు బయటకు చెప్పుకుంటే కేసులు నమోదవుతాయని మిన్నకుండిపోతున్నారు.

నిషేధిత విత్తనాలు సాగు చేస్తే కలుపు నియంత్రణకు ఉపయోగించే గ్‌లైపోసెట్‌ గడ్డి నివారణ మందు వాడకం కూడా పెరిగిపోతుంది. దీని ద్వారా పర్యావరణం, భూసారం దెబ్బతినడంతోపాటు రైతుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విత్తనాలను నిషేధించాయి. బీటీ–3 రైతుల చెంతకు చేరకుండా చూసేందుకు సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా సాగు ఆగుతుందా? అనేది అనుమానమే. గ్రామాల్లో బడా నేతలు విత్తనాలు సరఫరా చేసే ఏజెంట్లుగా అవతారం ఎత్తడమే కారణం. నిషేధిత విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌ లాంటి కఠినమైన కేసులు నమోదు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి.. పెద్ద మొత్తంలో ఎవరు సరఫరా చేశారు.. అనే దానిపై ఆరా తీసి కఠినచర్యలు తీసుకుంటేనే గానీ దందా ఆగేలా లేదు.

కఠినచర్యలు తప్పవు

నకిలీ విత్తనాలు అరికట్టడానికి టాస్క్‌ఫోర్స్‌ టీంలు ఏర్పాటు చేశాం. రైతుల వద్దకు చేరకుండా అడ్డుకట్ట వేస్తున్నాం. పోలీస్‌, వ్యవసాయశాఖల అధికారులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వ గుర్తింపు లేని విత్తనాలు సాగు చేస్తే రైతులు నష్టపోతారు. భూసారం కూడా దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది. రైతులతో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నాం. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై కఠినచర్యలు తప్పవు.

– సురేఖ, జిల్లా వ్యవసాయాధికారి

కొనేళ్లుగా జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది 1.60 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఈసారి విస్తీర్ణం మరింత పెరిగే అవకాశముంది. గతంలో సాధారణ పత్తి విత్తనాలు సాగు చేసిన రైతులు దిగుబడి పెరిగేందుకు బీటీ రకం విత్తనాల వైపు మొగ్గు చూపుతూ వస్తున్నారు. ఈ రకం విత్తనాలు సాగు చేస్తే దిగుబడి పెరగడంతోపాటు చీడపీడల వ్యాప్తి పెరిగింది. దీనిని తట్టుకునేందుకు బీటీ–2 రకం విత్తనం మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. ఈ విత్తనాలు సాగు చేయగా పంటను గులాబీ రంగు పురుగు ఆశించి రైతులకు కొంత మేర నష్టం చేసింది. దీంతో రైతులు ఎక్కువ దిగుబడి కోసం అధిక మోతాదులో ఎరువులు వినియోగిస్తుండడంతో పత్తి పంటలో కలుపు కూడా అధికంగా పెరుగుతోంది. కలుపు నివారణ సమస్యను అధిగమించేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పంట చేతికి వచ్చే వరకు మూడుసార్లు కలుపు నివారించాల్సి ఉంటుంది. కూలీల కొరతతోపాటు ఖర్చూ పెరిగిపోయింది. దీంతో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా బీటీ–3 రకం కలుపు మందు(గ్‌లైపొసెట్‌)ను తట్టుకునే సామర్థ్యం ఉన్న విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. రైతులు ఐదారేళ్లుగా ఈ విత్తనాలవైపే మొగ్గు చూపుతున్నారు.

జిల్లాలో

పత్తి సాగే అధికం

అవగాహన

కల్పిస్తేనే మేలు

Advertisement
 
Advertisement
Advertisement