మంచిర్యాలటౌన్/మంచిర్యాలరూరల్(హాజీ పూర్): చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని, పౌష్టికాహారంపై ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించేందుకే పోషణ్ పక్వాడ్‌ను ఈ నెల 9నుంచి 23వరకు జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్‌ఖాన్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని చున్నంబట్టివాడ అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడ్ ముగింపు కార్యక్రమం, 48వ డివిజన్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులకు శ్రీమంతాలు చేసి, అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. అనంతరం పోషణ ప్రతిజ్ఞ, పౌష్టికాహారం ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో చందన, సూపర్‌వైజర్లు జ్యోతి, సరిత, పోషణ్ అభియాన్ రజిత, శ్యామల, కార్పొరేటర్ పెంట రజిత పాల్గొన్నారు.


