సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సిటిజన్ లాగిన్‌లో సేల్‌డీడ్‌లో ఉన్న ఆప్షన్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు తెరలేపిన తీరుపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఖజానాకు గండి కొట్టారు’ కథనం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. చాలామంది అధికారులు ఈ తరహా మోసంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా మోసంపై రెవెన్యూ అధికారులతోపాటు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. ఇలాంటి మోసం ఇప్పటివరకు ఎక్కడా వెలుగులోకి రాకపోవడంతో జిల్లాలోని రెవెన్యూ అధికారులు అప్రమత్తం అయ్యారు. గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బెల్లంపల్లి సబ్‌డివిజన్‌లో సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్‌తో కలసి బెల్లంపల్లి, నెన్నెల, కన్నెపల్లి, తాండూరు మండలాల తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. భూ భారతి పోర్టల్‌లో దరఖాస్తులను పరిశీలించారు. నెన్నెల మండలంలో ఎప్పటి సేల్‌డీడ్ అగ్రిమెంట్ విత్ పొసిషన్, సేల్ డీడ్ అగ్రిమెంట్ విత్ అవుట్ పొసిషన్ ఆప్షన్లలో తేడా చూపిస్తూ.. సర్కారుకు స్టాంపు డ్యూటీ తగ్గించేలా చేసి, మిగతా మొత్తాన్ని తమ జేబుల్లో వేసుకున్న తీరుపై విచారణ మొదలైంది. ఈ ఏడాదిలో 31డాక్యుమెంట్లలో ఈ తరహాలో సేల్ విత్ పొసిషన్ ఆప్షన్ ఎంచుకున్నారు. వీటిని ఒక్కొక్కటిగా అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాల్సి ఉంది. అంతకుముందు సైతం ఈ ఆప్షన్‌తో లావాదేవీలు జరిగాయి. రిజిస్ట్రేషన్ సమయంలో పట్టాదారులు, కొనుగోలుదార్లకు ఈ ఆప్షన్‌పై అవగాహన లేకపోవడం, మరోవైపు ఎంత మొత్తంలో చలానా చెల్లించాము? ఎంత మొత్తానికి ఈ చలానా వచ్చింది? అంతేకాక రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక తహసీల్దార్ రివర్స్ ఎండార్స్‌మెంట్ పరిశీలన లేకపోవడం ప్రధాన లోపంగా మారింది. ఈ క్రమంలో జిల్లాలో ఇంకా ఎక్కడైనా ఇలాంటి మోసాలు జరిగాయా? అని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది. అయితే ధరణి నుంచి ప్రస్తుత భూ భారతి వరకు ఇలాంటి రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది.
వివరాలన్నీ పంపించాలి
నెన్నెల: భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ పకడ్బందీగా చేపట్టి వెంటనే లావాదేవీల వివరాలన్నీ పంపించాలని కలెక్టర్ కుమార్ దీపక్ తహసీల్దార్ శ్రీనివాస్‌ను ఆదేశించారు. గురువారం ఆయన బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. భూభారతి పోర్టల్‌లో లావాదేవీలు పరిశీలించారు. 2021 నుంచి లావాదేవీలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. స్లాట్ బుకింగ్ చేసిన వ్యక్తుల వద్ద అవకతవకలు జరిగినట్లు గమనించారు. స్టాంప్ డ్యూటీపై తహసీల్దార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2021 నుంచి జరిగిన సేల్ డీడ్ లావాదేవీల వివరాలన్నీ తనకు పంపించాలని ఆదేశించారు. వివిధ రకాల భూ సమస్యలపై అర్జీదారులు అందించిన దరఖాస్తులను రికార్డులతో సరి చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పకడ్బందీగా పరిష్కరించాలని తెలిపారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భూ భారతి పరిష్కార ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపట్టాలని తెలిపారు.
నెన్నెల మండలంలో గత కొంతకాలం ఓ వ్యక్తి సిటిజన్ లాగిన్‌తో భూ లావాదేవీల్లో ఆరితేరి గత కొంతకాలంగా రెవెన్యూ అధికారులను బురిడీ కొట్టించి రూ.లక్షలు అక్రమంగా సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలు వెలుగులోకి రావాలంటే రెవెన్యూ అధికారులు స్లాట్ బుకింగ్ కోసం సిటిజన్ లాగిన్‌లో ఎవరి నుంచి అప్లికేషన్ జనరేట్ అయింది? ఎందుకు రెండు సార్లు దరఖాస్తును మార్చుతున్నారు? రిజిస్ట్రేషన్ సమయంలో సాక్షులు, కొనుగోలుదారులు మధ్యవర్తులకు చలానా కోసం ఎంత మొత్తం చెల్లించారు? అలాగే మొదట దరఖాస్తులో చూపించిన మొత్తం, చివరకు ఈ చలానా వివరాల్లో కనిపిస్తున్న మొత్తానికి ఎందుకు తేడా వస్తోందనే కోణాల్లో పరిశీలన చేస్తే అసలు బాగోతం బయటపడనుంది.
అక్రమాలకు నెలవు


