● డైరెక్టర్(పీపీ) కే.వెంకటేశ్వర్లు
శ్రీరాంపూర్/జైపూర్: రాబోయే మూడు నెలలు కంపెనీ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి పెరుగనుందని, అందుకు అనుగుణంగా రవాణా పెంచాలని సింగరేణి డైరెక్టర్(పీపీ) కే.వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఆయన శ్రీరాంపూర్ సీహెచ్‌పీ, జైపూర్ మండలం ఇందారం ఐకే–ఓసీపీని సందర్శించారు. ఐకే–ఓసీపీలో క్వారీ, పని ప్రాంతాలు పరిశీలించారు. ఓబీ తొ లగింపు, బొగ్గు ఉత్పత్తి, యంత్రాల పనితీరు ఇతర అంశాలపై స్వయంగా పరిశీలించారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి పెంపుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతీరోజు 1200టన్నుల బొగ్గు ఉత్పత్తి, 5వేల టన్నుల ఓబీ తొలగించాలని ఆదేశించారు. శ్రీరాంపూర్ సీహెచ్‌పీలో ఏరియా ఇన్‌చార్జి జీఎం కే.రాజేందర్‌తో కలిసి బొగ్గు రవాణాపై సమీక్షించారు. బొగ్గు రవాణా కోసం రైల్వేశాఖ కేటాయించిన రేకులు పూర్తిగా నింపి పంపించాలని, నిర్ణీత సమయానికి నింపి పంపించకుంటే జరిమానా భరించాల్సి వస్తుందని తెలిపారు. వార్షిక బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత సాధనే లక్ష్యంగా అందరూ సమష్టిగా కృషి చేయాలని తెలిపారు. మ్యాన్ పవర్, మెటీరియల్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్రం, ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి ఏవీ రెడ్డి, శ్రీరాంపూర్ సీహెచ్‌పీ ఇన్‌చార్జీ చంద్రలింగం, మేనేజర్ ఆపరేషన్స్ శంకర్, రామకృష్ణ, మహేశ్ పాల్గొన్నారు.


