నార్నూర్: ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కోలాంగూడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్నూర్ మండల కేంద్రంలోని కోలాంగూడకు చెందిన అలవోజు వనిత (45), భర్త శంకరయ్యలు మూడేళ్ల క్రితం ఇంటి నిర్మాణం చేపట్టారు. అందుకు దాదాపు రూ.8 లక్షల వరకు అప్పు చేశారు. మూడేళ్లుగా అప్పు తీర్చలేక వనిత మనోవేధనకు గురైంది. అప్పు ఎలా తీర్చాలి..? పిల్లల భవిష్యత్తు ఏంటి..? అని ఆమె నిరంతరం ఆందోళన చెందుతుండేదని శంకరయ్య కన్నీరుమున్నీరయ్యారు. ఈక్రమంలో బుధవారం ఉదయం ఇంటి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలాన్ని ఏఎస్సై గణపతి పరిశీలించి వివరాలు సేకరించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.


