మెడి‘కిల్‌’ బోర్డు..! | - | Sakshi
Sakshi News home page

మెడి‘కిల్‌’ బోర్డు..!

Apr 23 2026 8:48 AM | Updated on Apr 23 2026 8:48 AM

● ఏడాదిగా సమావేశం కాని వైనం.. ● ఇబ్బంది పడుతున్న సింగరేణి కార్మికులు ● దయనీయంగా దరఖాస్తుదారుల పరిస్థితి ● ఉద్యోగుల సంఖ్య తగ్గించేందుకేనా..?

శ్రీరాంపూర్‌:సింగరేణిలో మెడికల్‌ బోర్డుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం ఉన్న అనిశ్చితితో మెడికల్‌ బోర్డు నిర్వహిస్తారా? లేదా ఎత్తేస్తారా? అనే చర్చ జరుగుతోంది. పదేళ్లుగా సక్రమంగా నిర్వహించిన మెడికల్‌ బోర్డు ఏడాది కాలంగా బంద్‌ చేశారు. కేవలం రిఫరల్‌ కేసులకు రెండుసార్లు బోర్డుపెట్టి చేతులు దులుపుకున్నారు. దీంతో అనారోగ్యం బారిన పడిన కార్మికులు విధులు నిర్వర్తించలేక దరఖాస్తు చేసుకున్నవారు, గుండెకు స్ట్రంట్స్‌, బైపాస్‌, ఇతర సర్జరీలు చేసుకున్న సుమారు 2,500 మంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. చివరి సారిగా 2025, మార్చి 21లో బోర్డు నిర్వహించారు. ఆ తర్వాత జూలైలో 54 రిఫరల్‌ కేసులను పిలిచినా కేవలం ఐదుగురిని ఇన్వాలిడేషన్‌ (అన్‌ఫిట్‌) చేసి మిగిలిన వారిని డ్యూటీ చేసుకోవాలని తిప్పి పంపించారు. నవంబర్‌లో కూడా ఇలాగే 129 మందిని పిలిచి కేవలం 25 మందినే ఇన్వాలిడేషన్‌ చేశారు.

పర్చేంటేజీ తగ్గించారు..

పదేళ్లలో జరిగిన మెడికల్‌ బోర్డులు పరిశీలిస్తే జబ్బుపడిన కార్మికుల్లో కనీసం 70 నుంచి 80 శాతం వరకు ఇన్వాలిడేషన్‌ చేశారు. దీంతో వేలాది మంది కార్మికుల పిల్లలు కారుణ్య ఉద్యోగాలు పొందారు. ఇప్పటి రెండు బోర్డులను పరిశీలిస్తే ఇన్వాలిడేషన్‌ శాతం చాలా తగ్గించారని, ఇది మున్ముందు ఎత్తివేసే కుట్ర అని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మళ్లీ పాత రోజులే వస్తున్నాయని కార్మికులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే గతంలో నిర్వహించిన మెడికల్‌ బోర్డులో కారుణ్య ఉద్యోగాలు పొంది మెడికల్‌ఫిట్‌ అయిన 350 మంది డిపెండెంట్లకు సైతం పోస్టింగ్‌ లెటర్లు ఇవ్వడం లేదు.

ఎక్సెస్‌ ఉన్నారనే...

కంపెనీలో అవసరానికి మించి సుమారు 2,500 మంది ఎక్సెస్‌ కార్మికులు ఉన్నారని, ప్రస్తుతం మెడికల్‌ బోర్డు నిర్వహించి కారుణ్య ఉద్యోగాలు కొనసాగిస్తే మున్ముందు ఈ సంఖ్య మరింత పెరుగుతుందని, అందుకే ఈ సంఖ్య తగ్గించాలనే బోర్డును బంద్‌ పెట్టారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కంపెనీని ప్రైవేటు పరం చేయడానికి దశల వారీగా యాజమాన్యం, ప్రభుత్వాలు కలిసి కు ట్రలు చేస్తూ కొత్త గనులు తీసుకురావడం లేదని, దీ ని ప్రభావం వల్లే ఉద్యోగుల సంఖ్య ఎక్సెస్‌ అయ్యిందని, ఆ సాకుతో కారుణ్య ఉద్యోగాలను ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నారని కార్మికులు మండి పడుతున్నారు.

ఏసీబీ విచారణ మంట...

2014 నుంచి 2024 వరకు జరిగిన మెడికల్‌ బోర్డు ఇన్వాలిడేషన్‌, అందులో పొందిన కారుణ్య ఉద్యోగాలపై ఏసీబీ చేత విచారణ జరిపిస్తామని సా క్షాత్తూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసన మండలిలో ప్రకటించడం మంటలు రేపింది. దీనిపై అన్ని కార్మిక సంఘాలు మండిపడ్డాయి. విచారణ పేరుతో కారుణ్య ఉద్యోగాలు చేస్తున్న వారిని ఇ బ్బందులకు గురిచేస్తే సహించబోమని హెచ్చరించా రు. గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో పాటు ప్రా తినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ, ఇతర సంఘాలు మెడికల్‌బోర్డు పెట్టాలని ఆందోళనలు చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement