నేరడిగొండ: నకిలీ సిగరెట్లను పట్టుకొని నలుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ రూరల్ సీఐ సీహెచ్ రమేశ్ బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 20న మధ్యాహ్నం నిజామాబాద్ నుంచి నేరడిగొండ వైపు ద్విచక్ర వాహనంపై డూప్లికేట్ గోల్డ్‌ఫ్లేక్ సిగరెట్లు తీసుకొస్తున్నారన్న సమాచారం మేరకు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న బైక్‌ను ఆపి తనిఖీ చేయగా వివిధ బ్రాండ్ల రూ.60 వేల 400 విలువ గల నకిలీ సిగరెట్ ప్యాకెట్లు లభించాయి. వాటిలో గోల్డ్ ఫ్లేక్ ప్రీమియం, గోల్డ్ ఫ్లేక్ లైట్, గోల్డ్ ఫ్లేక్ కింగ్స్, మార్ల్‌బోరో అడ్వాన్స్ కంపాక్ట్ బ్రాండ్ల ప్యాకెట్లు ఉన్నాయి. నిందితుల వద్ద నుంచి బైక్‌తో పాటు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు నకిలీ సిగరెట్లను నిజామాబాద్‌కు చెందిన ఇమ్రాన్ వద్ద నుంచి విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆటోనగర్‌కు చెందిన మహ్మద్ సమ్దాని, ఆర్సపల్లికి చెందిన మండుల పవన్ కుమార్, ఇమ్రాన్‌లను అరెస్ట్ చేయగా, కిన్వట్‌కు చెందిన వాసే పరారీలో ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. నిందితులను నేరడిగొండ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వివరించారు.


