భైంసాలో వైద్యుడి హఠాన్మరణం | - | Sakshi
Sakshi News home page

భైంసాలో వైద్యుడి హఠాన్మరణం

Apr 23 2026 8:48 AM | Updated on Apr 23 2026 8:48 AM

భైంసాటౌన్‌: పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు, నర్సాపూర్‌(జి) సీహెచ్‌సీ ఆస్పత్రిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా పని చేసే జీడీ సురేందర్‌(50) బుధవా రం గుండెపోటుతో మృతి చెందాడు. పట్టణంలోని తన ప్రైవేట్‌ ఆస్పత్రి లో బుధవారం విధులు నిర్వర్తిస్తుండగానే ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది వెంటనే నిర్మల్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.

పేద కుటుంబం నుంచి..

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలోని కిసాన్‌దాస్‌పేట కాలనీకి చెందిన జీడి సాయిలు–పోశవ్వ దంపతుల కుమారుడైన జీడి సురేందర్‌ పేద కుటుంబానికి చెందినవారు. పదో తరగతి వరకు స్థానిక జెడ్పీ పాఠశాల, ఇంటర్‌ సిరిసిల్లలో, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతుండగానే వెటర్నరీ శాఖలో ఉద్యోగం పొందారు. అనంతరం వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివారు. 2011లో భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఆయన ఎంతో మంది పేదలకు వైద్యసేవలందించారు. ఆయనకు భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హైదరాబాద్‌లో మెడిసిన్‌ చదువుతుండగా.. చిన్న కుమార్తె ప్రైవేట్‌ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆయన హఠాన్మరణంపై వైద్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement