విద్యుత్‌షాక్‌తో వివాహిత మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో వివాహిత మృతి

Apr 22 2026 9:18 AM | Updated on Apr 22 2026 9:18 AM

తాంసి: భీంపూర్‌ మండలం అర్లి(టి) పంచాయతీ పరిధి మందపల్లి గ్రామంలో సోమవారం విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు గ్రామానికి చెందిన ఆత్రం మీనాక్షి (27) ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లో ఉన్న కూలర్‌లో నీరు నింపింది. అనంతరం స్విచ్‌ ఆన్‌చేసే క్రమంలో స్విచ్‌బోర్డు తీగలు నేరుగా చేతికి తగలడం.. కాళ్ల కింద నీరు ఉండటంతో విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందింది. సోమవారం ఉదయం మృతదేహాన్ని ఎస్సై ప్రణయ్‌ కుమార్‌ పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మీనాక్షికి భర్త, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. భర్త సురేందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇంట్లో పాముకాటుతో వ్యక్తి..

ఖానాపూర్‌: ఖానాపూర్‌ పట్టణం రాజీవ్‌నగర్‌కు చెందిన ఎనుగుల రాజేశ్వర్‌ (54) నాగుపాము కాటుకు గురై మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో తన ఇంటిలోనే రాజేశ్వర్‌ను నాగుపాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖానాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. అయితే నిర్మల్‌ ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు రాజేశ్వర్‌ మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుడికి ఇద్దరు భార్యలు, నలుగురు పిల్ల లు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రాహుల్‌ గైక్వాడ్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ ఒకరు..

తానూరు: మండలంలోని జౌలా(బి) గ్రామానికి చెందిన గంగుల్వార్‌ నగేశ్‌ (35) అనే వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు ఎస్సై షేక్‌ జుబేర్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. మృతుడు నగేశ్‌ ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ధర్మాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా మృతిచెందాడు. మృతుడి భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వ్యక్తి..

నిర్మల్‌రూరల్‌: నిర్మల్‌ మండలంలోని మేడిపల్లి వద్ద సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై నింపాది తెలిపారు. ఆయన కథనం ప్రకారం మామడ మండలం గాయదుపల్లికి చెందిన జాదవ్‌ ప్రకాశ్‌ (30) బైక్‌పై ఆదిలాబాద్‌ నుంచి నిర్మల్‌ వస్తుండగా మండలంలోని మేడిపల్లి బస్‌స్టాప్‌ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రకాశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కూలీ పని చేసుకొని జీవించే జాదవ్‌ ప్రకాశ్‌కు భార్య, సంవత్సరం వయసు గల కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు.

వడదెబ్బతో ఒకరు..

శ్రీరాంపూర్‌: శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్కే 6 కాలనీకి చెందిన గొడిశెల శ్రీనివాస్‌(46) అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శ్రీనివాస్‌ టెంట్‌హౌజ్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 13న ఓ శుభకార్యానికి టెంట్‌ వేసిన తర్వాత కొంత అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం వాంతులు, విరేచనాలు తీవ్రం కావడంతో స్థానిక వైద్యుని వద్ద చికిత్స పొందాడు. సోమవారం మరింత నీరసించడంతో కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.

వృద్ధురాలి మెడలోని

పుస్తెలతాడు చోరీ

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వేంపల్లికి చెందిన రాదండి పోసు అనే వృద్ధురాలి పుస్తెలతాడు చోరీకి గురైంది. హాజీపూర్‌ ఎస్సై కిరణ్‌కుమార్‌ కథనం మేరకు.. రాదండి పోసు ఉదయం పోచమ్మ ఆలయం పరిసరాలను శుభ్రం చేసేందుకు వెళ్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఒక్కసారిగా మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు. పోసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement