నెన్నెల: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రైతులు, ఉపాధి కూలీలు ఎండలో ఎక్కువ సేపు పని చేయడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పరిహారం అందజేస్తోంది. తెలంగాణలో వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల ఆర్థిక సాయం (ఎక్స్‌గ్రేషియా) అందిస్తోంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) ద్వారా ఈ పరిహారం ఇస్తున్నారు. గతంలో ఈ మొత్తం రూ.50వేలుగా ఉండేది. ప్రస్తుతం ఆపద్బంధు పేరుతో రూ.4 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
మండలానికి త్రిసభ్య కమిటీ
ఆపద్బంధు పథకం కింద వడదెబ్బతో మృతి చెందిన వారిని నిర్ధారించేందుకు ప్రతీ మండలంలో ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. కమిటీలో స్థానిక వైద్యాధికారి, ఎస్సై, తహసీల్దార్ సభ్యులుగా ఉంటారు. వడదెబ్బతో మరణిస్తే మృతుల కుటుంబీకులు పోలీసులకు, వైద్యాధికారికి సమాచారం అందించాలి. వైద్యులు మృతి ధ్రువీకరించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తారు. అనంతరం పోస్టుమార్టం నివేదికను వైద్యాధికారి పోలీస్‌స్టేషన్‌కు అందజేసి ఎఫ్‌ఐఆర్ ఆధారంగా వడదెబ్బ మృతిగా నిర్ధారిస్తారు. ఈ నివేదికను తహసీల్దార్ ద్వారా ఆర్డీవోకు, అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు. ఆ తర్వాత బాధిత కుటుంబానికి రూ.4 లక్షల పరిహారాన్ని విడుదల చేస్తారు.


