ఆదిలాబాద్‌టౌన్: ఎండ తీవ్రత కారణంగా ఓ విద్యార్థిని పరీక్ష కేంద్రంలో సొమ్మసిల్లి పడిపోయిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో సోమవారం బేల మండలం చప్రాల గ్రామానికి చెందిన ధనశ్రీ అనే విద్యార్థిని డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్ష రాసింది. పరీక్ష ముగిసిన తర్వాత ఎండ తీవ్రతను తట్టుకోలేక కళాశాల ప్రాంగణంలోనే ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన కళాశాల సిబ్బంది వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాగా బేల పరీక్షా కేంద్రాన్ని ఆదిలాబాద్‌కు మార్చడం వల్లే విద్యార్థులు మండుటెండలో ప్రయాణాలు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. కాగా విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.


