అందుబాటులోకి స్మృతివనం
నేడు అధికారికంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం
తరలిరానున్న ఆదివాసీలు, ప్రజాప్రతినిధులు
ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అధికారంలోకి రాగా నే స్మృతి వనం ఏర్పాటుకు సంకల్పించారు. రూ.కో టి మంజూరు చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మె ల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేతుల మీదుగా ప్రారంభించారు. అలాగే, అమరుల కుటుంబాలను ఆదుకుంటామని ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. బాధిత కుటుంబాలకు ఐటీడీఏ ద్వారా రాయితీ రుణాలతో వాహనాలు అందించడంతోపాటు మండలంలోని ముత్నూర్ సమీపంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేశారు. పనులు కొనసాగుతున్నాయి.
అసలేం జరిగింది..
స్వాతంత్య్రం వచ్చి అప్పటికి మూడున్నర దశాబ్దాలవుతున్నా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఈ క్రమంలో 1981లో చట్టబద్ధమైన హక్కుల సాధనకు పీపుల్స్‌వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరి ట ఇంద్రవెల్లిలో గిరిజన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఆ రోజు సోమవారం వారసంత కావడంతో ఉదయం నుంచే ఆదివాసీలు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 3గంటల వరకే ప్రాంగణం గిరిపుత్రులతో కిక్కిరిసిపోయింది. సభా స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయినా వినకుండా మరికొందరు ర్యాలీగా అక్కడికి బయలుదేరారు. వారిని అడ్డుకునే క్రమంలో ముందున్న గిరి జన యువతితో ఓ పోలీసు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె వెంటనే అతడిపై దాడి చేయగా నేలకొ రిగాడు. పరిస్థితి చేయిదాటి పోవడంతో పోలీసులు తూటాల వర్షం కురిపించారు. రక్తం ఏరులై పారింది. ఈ ఘటనలో 15మంది ఆదివాసీలు చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. కానీ, తూటాల గాయాలతో తమ ఇళ్లకు వెళ్లి పోలీసుల భయంతో బయటకు రాలేక, వైద్యం అందక సుమారు 60మంది మృతి చెందినట్లు పౌరహక్కుల సంఘం నిజ నిర్ధారణ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది.
33 ఏళ్లు.. నివాళులకు దూరం
నాటి కాల్పుల ఘటన సాక్షిగా ఇంద్రవెల్లి సమీపంలో స్తూపం నిర్మించారు. ఆరోజు నుంచి ఉమ్మడి రా ష్ట్రపాలన ముగిసే వరకు 33 ఏళ్లుగా నివాళులర్పించడానికి అనుమతి ఇవ్వలేదు. ఏటా బందోబస్తు ఏర్పాటు చేసేవారు. 2004లో అప్పటి బోథ్ ఎమ్మె ల్యే సోయం బాపూరావ్ గిరిజన సంఘాల నాయకులతో పాటు ఎంపీ మధుసూదన్‌రెడ్డితో కలిసి ఏప్రి ల్ 25న నివాళులర్పించారు. అప్పటి నుంచి ఏటా ఆదివాసీలు ఆ రోజున ఆంక్షల మధ్య నివాళులర్పించడం ఆనవాయితీగా మారింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదివాసీ సంఘాల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఆంక్షలు సడలించింది. రెండు గంటల సమయం ఇవ్వడంతో ఆదివాసీలు సంప్రదాయ పూజలు చేసి నివాళులర్పిస్తూ వచ్చారు.
రెండోసారి స్మారక స్తూపం నిర్మాణం
ఆదివాసీల స్మారకార్థం రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లిలో 80 అడుగుల స్తూపాన్ని నిర్మించింది. దానిని 1986 మార్చిలో గుర్తు తెలియని వ్యక్తులు డైనమెట్ల తో పేల్చారు. గిరిజనుల ఆందోళనలతో 1987లో సర్కారు ఐటీడీఏ నిధులతో స్తూపం నిర్మించింది.
అమరవీరుల ఆశయ సాధనకు రిలే దీక్షలు
నాటి ఆదివాసీ అమరుల ఆశయ సాధన కోసం ఇటీవల కొద్ది రోజుల పాటు ఆదివాసీలు స్తూపం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతంలో పెసా, 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను తొలగించాలని, ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి అదుకోవాలని, ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
1981 ఏప్రిల్ 20. జల్..జంగల్.. జమీన్ కోసం ఉద్యమించిన అడవిబిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టి తూటాల వర్షం కురిపించింది. హక్కుల సాధనలో 15మంది గిరిజనులు అమరులయ్యారు. వారి రక్తపుటేరులతో తడిసిన పచ్చని వనం ఎరుపెక్కింది. వారి అమరత్వం నింగికెగిసిన అగ్నిశిఖలా ఇంద్రవెల్లిలో స్తూపమై నిలిచింది. ఈ ఘటన కు 45 ఏళ్లు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అమరవీరుల స్తూపాన్ని స్మృతివనంగా ఏర్పాటు చేసింది. ఆంక్షలు లేకుండా అధికారికంగా నివాళులర్పించే అవకాశం కల్పించింది. ఈ సారి కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. – ఇంద్రవెల్లి


