మార్చి 13నే యాజమాన్యానికి నోటీస్
22నుంచి తలపెట్టిన టీజీఆర్టీసీ జేఏసీ
32 డిమాండ్ల సాధనకు ఆందోళన బాట
ప్రభుత్వ స్పందనపై వీడని ప్రతిష్టంభన
మంచిర్యాలఅర్బన్: టీజీఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 22నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె తలపెట్టారు. 32 డిమాండ్లతో ఆర్టీసీ యాజమాన్యానికి మార్చి 13 న సమ్మె నోటీస్ అందజేసి దశలవారీగా ఆందోళన బాట పట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సర్వీస్ సమస్యలు, బెనిఫిట్స్ అంశాలు పరిష్కారం కాకపోవటంతో కార్మికులు అసంతృప్తితో ఉన్నారు. కార్మిక సంఘాలు, లేబర్ కమిషనర్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యా యి. దీంతో ఈ నెల 21 అర్ధరాత్రి నుంచి కార్మికులు సిద్ధంగా ఉండాలని జేఏసీ ప్రకటించగా.. ప్రభుత్వ స్పందనపైనే ప్రతిష్టంభన నెలకొంది.
సంఘాలపై సమ్మె ప్రభావం
గతంలో ఆర్టీసీలో 53 రోజుల సుదీర్ఘ సమ్మె కార్మిక సంఘాలపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పటి ప్రభుత్వం కార్మిక సంఘాల స్థానంలో 2019 డిసెంబర్‌లో సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రెండేళ్ల తర్వాత ఎన్నికల నిర్వహణపై ఇచ్చిన హామీపై ఊసేలేకుండా పోయింది. పెండింగ్ సమస్యలు, కార్మికుల పనిభారం నేపథ్యంలో యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌తో సంతకాల సేకరణకు దిగారు. ఆర్టీసీలో రెండేళ్లకోసారి నిర్వహించే ఎన్నికల్లో ప్రతి ఓటరూ రాష్ట్ర, జిల్లా కమిటీకి రెండు ఓట్లు వేసే అవకాశముండేది. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు 2016లో చివరిసారి నిర్వహించగా.. కార్మిక సంఘాలకు బదులుగా సంక్షేమ మండళ్లు కొనసాగుతున్నాయి.
డిపోలో తగ్గిన కార్మికులు
ఆర్టీసీలో 2019నుంచి ఇప్పటివరకు కార్మికుల సంఖ్య తగ్గింది. అప్పటి సమ్మె కాలంలో మంచిర్యాల డిపోలో 572 మంది ఉండగా, ప్రస్తుతం 468 మందికి పడిపోయింది. అద్దె బస్సులు పెరిగిపోవటం.. మునుపెన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ డ్రైవర్లను నియమించటంతో రెగ్యులర్ కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది. నూతన నియామకాలు చేపట్టకపోవడమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం డిపోలో 148బస్సుల్లో సంస్థ బస్సులు 79 కాగా 69 అద్దె బస్సులున్నాయి. ఆర్టీసీ ౖడ్రైవర్లు 151 మంది, కండక్టర్లు 199 మంది, అవుట్‌సోర్సింగ్ (ఓఎస్) డ్రైవర్లు 28మంది ఉన్నారు. ట్రాఫిక్ విభాగంలో 20మంది, గ్యారేజ్, స్టోర్, సెక్యూరిటీ, ఆఫీస్ ఉద్యోగులు 70మంది విధులు నిర్వహిస్తున్నారు.


