మంచిర్యాలఅర్బన్: విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వంటశాల, సామగ్రి నిల్వ గదిని పరిశీలించి ఆహార తయారీ సమయంలో సిబ్బంది శుభ్రత పాటించాలన్నారు. ఇంటర్‌లో అనుత్తీర్ణులైన విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల తీరును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఆదర్శ గృహంలో కొనసాగుతున్న పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, సంక్షేమ వసతి గృహాల్లో సకల సదుపాయాలు కల్పించి నాణ్యమై విద్యను అందించడం జరుగుతుందన్నారు.
ధరిత్రి దినోత్సవం విజయవంతం చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ఈ నెల 22న ధరిత్రి దినోత్సవం విజయవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో డీఈవో యాదయ్యతో కలిసి ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్, ప్రణాళిక సమన్వయకర్త భరత్ కుమార్, నాణ్యత సమన్వయకర్త జంబోజు సత్తయ్య, జెండర్ అండ్ ఈ క్వింటీ సమన్వయకర్త విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


