మంచిర్యాలటౌన్: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడంతో ఆమోదం పొందలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మహిళా బిల్లును వ్యతిరేకించడం వల్ల తెలంగాణలో 60 మంది మహిళలు ఎమ్మెల్యేలుగా, తొమ్మిది మంది మహిళలు ఎంపీలు అయ్యే అవకాశం కోల్పోయారన్నారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. సెన్సెస్ ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగదని చెప్పడం కూడా సరికాదని, ఈ బిల్లును సైతం అడ్డుకున్నారన్నారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్ గౌడ్, కార్పొరేటర్ అనిత, నాయకులు వెంకటేశ్వర్‌రావు, కృష్ణమూర్తి, వెంకటకృష్ణ, ఆంజనేయులు, స్వాతి, సుజాత, స్వప్న, రజిత, జయరామారావు, రాజ్‌కుమార్, స్వామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


