నేటి నుంచి పది, ఇంటర్ పరీక్షలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘పది’లో 3,053 మంది.. ఇంటర్‌లో 2,912 మంది ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
లక్ష్మణచాంద/కెరమెరి: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఓపెన్ పదోతరగతి, ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమన్వయకర్త అశోక్ తెలిపారు. పదో తరగతి అభ్యర్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ అభ్యర్థులకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
మౌలిక వసతుల కల్పన..
ఎంత తీవ్రను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, మూత్రశాలలు వంటి మౌలిక వసతులు ఉన్న పాఠశాలలనే పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్యసిబ్బంది, మందులు అందుబాటులో ఉంచనున్నారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లాలో ఓపెన్ పదో తరగతి పరీక్షలకు 1,035 మంది, ఇంటర్ పరీక్షలకు 747 మంది వి ద్యార్థులు హాజరుకానున్నారు. పదోతరగతికి 5, ఇంటర్‌కు 4 పరీక్షా కేంద్రాలు కేటాయించారు. 9 మంది సీఎస్‌లు, 9 మంది డీవోలు, 9 మంది సిట్టింగ్ స్క్వాడ్, నలుగురు ఫ్లయింగ్ టీమ్, 95 మంది ఇ న్విజిలేటర్లను కేటాయించినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో....
మంచిర్యాల జిల్లాలో ఓపెన్ పది పరీక్షలకు 475 మంది, ఇంటర్ పరీక్షలకు 1,226 మంది హాజరుకానున్నారు. 8 పరీక్షా కేంద్రాలు, సీఎస్‌లు 8 మంది, డీవోలు 8 మందిని కేటాయించారు.
ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు...
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఓపెన్ పాఠశాలలో హాల్ టికెట్లు తీసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో తీసుకున్న హాల్ టికెట్లు కూడా అనుమతిస్తారని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి జిల్లా సమాచారం
ఓపెన్ ‘పది’ అభ్యర్థులు 3,053
ఇంటర్ అభ్యర్థులు 2,912
‘పది’ పరీక్ష కేంద్రాలు 15
ఇంటర్ పరీక్ష కేంద్రాలు 14
సీఎస్‌లు 29
డీవోలు 29
ఆదిలాబాద్ జిల్లాలో...
ఆదిలాబాద్ జిల్లాలో ‘పది’ పరీక్షలకు 900 మంది, ఇంటర్‌కు 584 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. 7 పరీక్షా కేంద్రాలు, ఏడుగురు డీవోలు, ఏడుగురు సీఎస్‌లు, ఏడుగురు సిట్టింగ్ స్క్వాడ్‌ను కేటాయించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో...
ఆసిఫాబాద్ జిల్లాలో పది పరీక్షలకు 643 మంది, ఇంటర్ పరీక్షలకు 360 మంది హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాలు 5, ఐదుగురు సీఎస్‌లు, ఐదుగురు డీవోలను కేటాయించారు.


