హాజరుకానున్న 1,80,991 మంది విద్యార్థులు మూడు ఉమ్మడి జిల్లాల్లో 115 పరీక్ష కేంద్రాలు నాలుగు ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాల ఏర్పాటు తొలిసారిగా ఆన్సర్ షీట్లపై స్టిక్కర్లు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారం నుంచి నిర్వహించే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఏ (ఎల్) కోర్సుల రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ల (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) పరీక్షలు, మొదటి, మూడు, ఐదవ సెమిస్టర్ పరీక్షల (బ్యాక్ లాగ్) నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20, 22, 24, 27, 29, మే 1, 4, 6న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 21, 23, 25, 28, 30, మే 2, 5, 7, 11 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20, 22, 24, 27, 29, మే 1, 4, 6, 8, 12, 14న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
బ్యాక్‌లాగ్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు..
కేయూ పరిధిలోని డిగ్రీ కోర్సుల బ్యాక్‌లాగ్ సబ్జెక్టుల విద్యార్థులకు మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21, 23, 25, 28, 30, మే 2, 5, 7, 11, 13న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 7, 8, 11, 13, 15, 18, 20, 22న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మూడో సెమిస్టర్ పరీక్షలు మే 12, 14, 16, 21, 23, 25, 26, 28 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాలను సందర్శించిన అధికారులు..
కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో 69,427 మంది, ఖమ్మం జిల్లాలో 38,143 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 73,421 మంది విద్యార్థులు మొత్తం 1,80,991 మంది పరీక్షలు రాయనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 115 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 115 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 115 మంది అబ్జర్వర్లను నియమించారు.
ఆన్‌లైన్‌లో జవాబుపత్రాల మూల్యాంకనం..
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నేపథ్యంలో తొలిసారిగా ఆన్సర్‌షీట్లపై స్టిక్కర్లు అంటించనున్నారు. హాల్‌టికెట్ నంబర్, సబ్జెక్టుల పేర్లు, పరీక్ష కేంద్రంపేరు, కోడ్‌నంబర్‌తో కూడిన స్టిక్కర్లను రూపొందించారు. క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. హాల్‌టికెట్ నంబర్‌ను బట్టి విద్యార్థి ఆన్సర్‌షీట్‌పై స్టిక్కర్‌ను అతికిస్తారు. ఇక విద్యార్థి ప్రత్యేకంగా హాల్‌టికెట్ నంబర్‌రాసే అవసరం ఉండదు. ఈ సెమిస్టర్ల జవాబుపత్రాల మూల్యాంకనం ఇక ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. విద్యార్థి ఆన్సర్‌షీట్‌పై ఉండే స్టిక్కర్‌ను కాకుండా మిగతా ఆన్సర్‌షీట్‌ను స్కాన్‌చేసి ఆన్‌లైన్‌లో జవాబుపత్రాలను మూల్యంకనం చేసే అధ్యాపకులకు పంపుతారు. మూల్యాంకనం తర్వాత ఇక మాన్యువల్‌గా కోడింగ్ డీకోడింగ్ ప్రక్రియ లేకుండానే విద్యార్థి ఆన్సర్‌షీట్‌పై ఉన్న స్టిక్కర్ ఆధారంగానే ప్రక్రియ పూర్తిచేస్తారు.


