నిర్మల్‌ఖిల్లా:‘విజయం అంటే ఒక గమ్యం కాదు.. నిరంతర ప్రయాణం.’ సాధించిన దానితో సంతృప్తి చెందకుండా, ఉన్నత లక్ష్యాల కోసం కృషి చేయాలనే స్ఫూర్తిని ఆచరణలో చూపుతున్నాడు నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ముడారపు విఘ్నేష్. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ప్రతిష్టాత్మకమైన కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం సాధించినప్పటికీ తన లక్ష్యం సివిల్ సర్వీసెస్ సాధన దిశగా అడుగులు వేస్తున్నాడు.
విజయపథంలో సాగుతున్న ప్రయాణం..
జిల్లా కేంద్రానికి చెందిన ముడారపు వాణి–శ్రీనివాస్ దంపతుల కుమారుడు విఘ్నేష్. తన పాఠశాల విద్యాభ్యాసాన్ని స్థానిక వాసవి హైస్కూల్‌లో, ఇంటర్ ఐఐటీ రామయ్య కళాశాలలో పూర్తి చేశాడు. తన ప్రతిభతో ఎన్‌ఐటి నాగ్‌పూర్‌లో బీటెక్ సీటు సాధించాడు. గేట్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 800 ర్యాంకు సాధించి ఢిల్లీ ఐఐటిలో అవకాశం పొందినా, సివిల్స్ లక్ష్యంతో ఆ సీటును వదులుకోవడం ఆయన పట్టుదలకి నిదర్శనం. అంతటితో ఆగకుండా, రాష్ట్ర స్థాయి గ్రూప్–1 పరీక్షలో 488 ర్యాంకు సాధించినా, ఆశించిన స్థాయి ఉద్యోగం రాకపోవడంతో దానిని కూడా వదిలేశాడు. చివరకు ఆలిండియా స్థాయిలో నిర్వహించే ఎస్‌ఎస్సీ సీజీఎల్–2025 పరీక్షలో సౌత్ జోన్‌లో 700 ర్యాంకు సాధించి తాజాగా జీఎస్టీ కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యాడు. ఉన్నతోద్యోగం రావడం ఆనందమేం కానీ నా అసలైన లక్ష్యం సివిల్ సర్వీసెస్ అని, ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తూనే అదే దిశగా సిద్ధమవుతున్నానని విఘ్నేష్ స్పష్టం చేస్తున్నాడు.


