పాతమంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్లాలని సీపీఐ నిర్ణయించుకున్నా స్థానికంగా కాంగ్రెస్ పార్టీ పాటించలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ అన్నారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల పొత్తులు, గెలుపోటములపై పార్టీ నాయకులతో విశ్లేషణ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా సీట్లు ప్రకటించడంతో సీపీఐకి నష్టం జరిగిందని అన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో పొత్తు విషయమై చర్చలు జరిగినా స్థానిక నాయకత్వం పార్టీని అగౌరవపరిచే రీతిలో మాట్లాడడం వల్ల అక్కడ బీఆర్‌ఎస్ గెలుపు అనివార్యమైందని తెలిపారు. బెల్లంపల్లిలో నామినేషన్ల వరకు పార్టీని మభ్యపెట్టి ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. ఓట్లు అవసరమైనప్పుడు పొత్తులు పెట్టుకుని ఆ తర్వాత కమ్యూనిస్టులను విస్మరించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో సీపీఐ, బీఆర్‌ఎస్ పొత్తును ప్రజలు హర్షించారని, చైర్‌పర్సన్ వైస్ చైర్‌పర్సన్ ఎన్నికపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నామని అన్నారు. కోల్‌బెల్ట్ ఏరియాలో సీపీఐకి బలమైన క్యాడర్ ఉందని, భవిష్యత్‌లోనైనా కాంగ్రెస్ పార్టీ మైత్రి సంబంధాలను గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలిందర్ అలీఖాన్, రాష్ట్ర సమితి సభ్యులు లింగయ్య, జిల్లా సమితి సభ్యులు పౌలు, దేవి పోచన్న, దుర్గారాజ్, కుంచాల శంకరయ్య పాల్గొన్నారు.


