చెన్నూర్: జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. గతంలో చురుగ్గా పనిచేసిన పేరెంట్స్ కమిటీలు నామమాత్రంగా పని చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ప్రతీనెల రెండో శనివారం తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించేవారు. ఇలా చేయడం ద్వారా ఇటు విద్యార్థులతో పాటు అటు ఉపాధ్యాయులు, సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉండేది. విద్యార్థులు తప్పు చేస్తే ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు పేరెంట్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లడంతో కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తీసుకువచ్చే అవకాశం ఉండేది. కానీ గతేడాది నుంచి చెన్నూర్ ప్రాంత గురుకుల పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహించక పోవడంతో విద్యావ్యవస్థ గాడితప్పుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చెన్నూర్ పట్టణంలోని బాలికల గురుకుల పాఠశాలలో పది రోజుల వ్యవధిలో వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఏడు నెలల క్రితం బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రహరీ దూకి ఇద్దరు యువకులు లోపలికి వచ్చిన ఘటనపై విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. చెన్నూర్ పట్టణంలో గల గురుకుల పాఠశాలలో గతంలో పలు సంఘటనలు జరిగినా నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ప్రిన్సిపాళ్లు స్థానికంగా ఉండక పోవడమేనా?
గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు స్థానికంగా ఉండక పోవడంతో రాత్రివేళల్లో పర్యవేక్షణ కరువైందనే ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది రాత్రి వేళ విధులు నిర్వహించినప్పటికి పైఅధికారులు అందుబాటులో లేకపోవడంతో ‘మాకేందుకులే’ అనే ధోరణి అవలంభిస్తున్నారని తెలిసింది. దీంతో కొంతమంది విద్యార్థులు ఇష్ట్యారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు గురుకులాలకు అందుబాటులో ఉండి విద్యార్థులు గాడి తప్పకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇలా చేస్తే మార్పు రావచ్చు
విద్యార్థుల మానసికస్థితిలో మార్పులు
విద్యార్థుల మానసిక స్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా మానసిక నిపుణుల చేత కౌన్సెలింగ్ ఇస్తున్నాం. చెన్నూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థిని మృతి బాధాకరం. మరో విద్యార్థిని చిన్న విషయానికి పెద్ద నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె సెఫ్‌గా ఉంది. చెన్నూర్ గురుకుల పాఠశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.
– రామకళ్యాణి, డీసీవో, మంచిర్యాల
ఏడాదిగా సమావేశాల్లేవ్
గతంలో గురుకుల పాఠశాలలో ప్రతీనెల రెండో శనివారం పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసేవారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం కమిటీపై అధికారుల నిర్లక్ష్యం పెరిగింది. పాఠశాలలో పర్యవేక్షణ కరువైంది. విద్యార్థులు గాడి తప్పుతున్నారు. కమిటీలను పటిష్టం చేయాలి. సమావేశాలు ఏర్పాటు చేయాలి.
– ఎన్.సారయ్య, పేరెంట్స్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి


