● ఆందోళనకు దిగిన వినియోగదారులు ● సమాచారం ఇచ్చినా స్పందించని ఫుడ్ ఇన్‌స్పెక్టర్
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెస్టారెంట్‌లో కుళ్లిపోయిన చికెన్ పీసులు విక్రయించారని వినియోగదారులు ఆందోళనకు దిగిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. బాధితులు కథనం ప్రకారం.. లక్ష్మణ్‌నాయక్ అనే వినియోగదారుడు కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లాడు. చికెన్ లాలిపాప్ ఆర్డర్ చేశాడు. కొద్దిసమయం తర్వతా హోటల్ నిర్వాహకులు ఇచ్చిన చికెన్ లెగ్‌పీస్, లాలిపప్‌లు కుళ్లిపోయి ఉండడం చూసి లక్ష్మణ్‌నాయక్ అవాక్కయ్యాడు. వెంటనే హోటల్ నిర్వహకుడిని పిలిచి వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో లక్ష్మణ్‌నాయక్, హోటల్ యజమాని మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దిక్కున్న చోట చెప్పుకో అంటూ హోట ల్ యజమాని సమాధానం చెప్పడంతో వినియోగదారుడు ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేశాడు. అయినా సదరు అధికారి స్పందించకపోవడంతో డయల్ 100కు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడి వివాదం సద్దుమణిగేలా చేశారు. ఈ విషయమై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వాసును వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా స్పందించలేదు.


