రైలు ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వ్యక్తి మృతి

Apr 6 2026 9:24 AM | Updated on Apr 6 2026 9:24 AM

మందమర్రిరూరల్‌: మందమర్రి రైల్వేస్టేషన్‌ సమీపంలో గుర్తు తెలియని రైలు నుంచి ఓ వ్యక్తి కింద పడగా తలకు తీవ్ర గాయలై మృతి చెందినట్లు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ జస్పాల్‌సింగ్‌ ఆదివారం తెలిపారు. మృతుని వద్ద హైదరాబాద్‌ నుంచి పందుర్ణ (మధ్యప్రదేశ్‌) ప్రయాణపు టికెట్‌ ఉందని, మిలిటరీ కలర్‌ షర్ట్‌, సిమెంట్‌ కలర్‌ లోయర్‌ ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. చేతిపై జైశ్రీరామ్‌ రబ్బర్‌ బ్యాండు, కుడి చేతిపై మై లవ్‌ ఎం అని టాటూ ఉందని పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు ఎస్సై (జీఆర్‌పీ) 8712658596, జస్పాల్‌సింగ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ 98490 58691నంబర్‌లలో సంప్రదించాలని సూచించారు.

చికిత్స పొందుతూ మృతి

లింగాపూర్‌: మండలంలోని ఏల్లాపటార్‌ గ్రామ పంచాయతీలోని రాముగూడ కాలనీకి చెందిన ఆత్రం అక్బర్‌షా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎస్సై గంగన్న తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధిహామీ పనికి వెళ్లాడు. ఇంటికి వచ్చాక వాంతులు, విరేచనాలు కావడంతో జైనూర్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరుసటి రోజు ఇంటికి తిరిగి వచ్చాడు. ఆదివారం వాంతులు, వీరేచనాలు ఎక్కువై మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

అనారోగ్యం బారిన కుటుంబం..

ఆత్రం అక్బర్‌షా భార్య, కుమారులు, కుమార్తె కూ డా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆదివారం గ్రామంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేంద్ర ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఆత్రం అక్బర్‌షా మృతికి కలుషిత ఆహారమే కారణమని నిర్ధారించారు. అతని కుటుంబ సభ్యులను జైనూర్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. వారు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. వైద్య శిబిరంలో డాక్టర్‌ మురళీకృష్ణ, సూపర్‌వైజర్‌ దత్తారాం ఉన్నారు.

కోడి పందేల స్థావరంపై దాడులు

దహెగాం: మండలంలోని ఐనం గ్రామ శివారులో కోడి పందేలు ఆడుతున్నారన్న సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం దాడులు చేసినట్లు ఎస్సై సీహెచ్‌ రమేశ్‌ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం సిబ్బందితో కలిసి స్థావరంపై దాడి చేసి నలుగురు నిందితులతో పాటు నాలుగు కోడి పుంజులు, రెండు కత్తులు, రూ.7,600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వెల్ములే దిలీప్‌, తక్కల్ల సంజీవ్‌, రాములు, కోట పోశంలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

దహెగాం: మండల కేంద్రం సమీపంలోని పెద్దవాగు నుంచి అక్రమంగా అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఆదివారం పట్టుకున్నట్లు ఎస్సై ీసీహెచ్‌ రమేశ్‌ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన పణ్యాల శ్రీనివాస్‌కు చెందిన ట్రాక్టర్‌లో డ్రైవర్‌ చప్పిడి దామోదర్‌ ఇసుక తరలిస్తున్నందున పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీజ్‌ చేసి డ్రైవర్‌ దామోదర్‌, ఓనర్‌ శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

పిడుగుపాటుతో ఒకరికి గాయాలు

కౌటాల: బెజ్జూర్‌ మండలంలో ఆదివారం వేకువజామున ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పోతేపల్లి గ్రామానికి చెందిన డోకి సంజీవ్‌ తన ఇటుకల బట్టీపై కవర్‌ కప్పడానికి వెళ్లగా పిడుగు పడడంతో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు గమనించి బెజ్జూర్‌ పీహెచ్‌సీకి, మెరుగైన వైద్యం కోసం కాగజ్‌నగర్‌ ఆసుపత్రికి తరలించారు. ఈదురు గాలులతో అందుగులగూడ గ్రామంలోని ఐదు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. బెజ్జూర్‌ –కౌటాల ప్రధాన రహదారిపై పలు చోట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement