పోడు రైతు ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

పోడు రైతు ఆత్మహత్యాయత్నం

Apr 6 2026 9:24 AM | Updated on Apr 6 2026 9:24 AM

చింతలమానెపల్లి: మండలంలోని గంగాపూర్‌ శివారులో పోడు భూముల స్వాధీనం వివాదాస్పదంగా మారింది. రైతు దుర్గం రాజేశ్వర్‌ ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పా ల్పడడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఖర్జెల్లి రేంజ్‌లోని బాలాజీ అనుకోడ సెక్షన్‌ బాబాపూర్‌ బీట్‌ గంగాపూర్‌ శివారులో గత కొద్ది రోజులుగా అటవీ అధికారులు పోడు భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈక్రమంలో గంగాపూర్‌ అటవీ నర్సరీ సమీపంలో కందకాల పనులు నిర్వహిస్తున్నారు. భూములు కోల్పోతున్న పలువురు రైతులు గత కొద్ది రోజులుగా అటవీ అధికారులను అడ్డుకుంటున్నారు. భూములు కోల్పోతున్న రైతు దుర్గం రాజేశ్వర్‌ శనివారం సాయంత్రం అటవీ అధికారులను సంప్రదించాడు. ఆక్రమణకు గురైన అటవీ భూమిని మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నామని అటవీ అధికారులు తెలియజేసినట్లుగా సమాచారం. దీంతో భూమిని కోల్పోతానని భావించిన రైతు రాజేశ్వర్‌ ఆదివారం ఉదయం కందకం తవ్వకాలు జరుగుతున్న చోట గడ్డిమందు సేవించాడు. అక్కడే ఉన్న పలువురు రైతులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై జీవన్‌ అక్కడికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన రైతును పోలీసు వాహనంలో చికిత్స కోసం తరలించారు. రైతు రాజేశ్వర్‌ను కుటుంబసభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది. భూముల స్వాధీనంపై ఖర్జెల్లి రేంజ్‌ అధికారి సుభాష్‌ను సంప్రదించగా ఈ బీట్‌లో 50హెక్టార్లలో కందకాలను గతంలోనే తవ్వామని, కొందరు వాటిని పూడ్చివేసి ఆక్రమించుకున్నారని తెలిపారు. అటవీ భూమి అయితేనే స్వాధనం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement