బెల్లంపల్లి: పాలిటెక్నిక్ విద్య చదువుతున్న కొత్త విద్యార్థులకు పూర్వ విద్యార్థులు మార్గదర్శకులు కావాలని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణమండలి (ఎస్‌బీటీఈటీ) సెక్రెటరీ ఈఆర్. పుల్లయ్య అన్నారు. ఆదివారం బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సాంకేతిక విద్య విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తాను మైనింగ్ విభాగంలో విద్యార్థులకు విద్యాబోధన చేశానని గుర్తు చేశారు. కళాశాల అభివృద్ధికి రూ.80 లక్షల నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. అంతకు ముందు పుల్లయ్య పూర్వ విద్యార్థుల రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్‌ను ఆవిష్కరించి వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కొత్తగా ఎన్నికై న పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.వినోద్ కళాశాల అభివృద్దికి రూ.లక్ష విరాళం అందజేసి విద్యార్థులకు క్రీడాసామాగ్రి పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


