● జడ్జిగా ఎంపికై న లిఖిత ● తండ్రి తోపుడు బండి వ్యాపారి
శ్రీరాంపూర్: ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని కష్టపడి చదివితే సాధించవచ్చని శ్రీరాంపూర్ ఏరియా అరుణక్కనగర్‌కు చెందిన ఏకారి లిఖిత నిరూపించారు. ఇటీవల న్యాయశాఖ వెల్లడించిన ఫలితాల్లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. ఏకారి వెంకటేశ్, లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు లిఖిత చిన్నప్పటి నుంచీ చదువులో ముందుంటోంది. పదో తరగతి వరకు స్థానిక ప్రైవేటు పాఠశాలలో, హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలోని కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, ఎల్‌ఎల్‌బీ చేసి ప్రస్తుతం ఎల్‌ఎల్‌ఎం చదువుతోంది. నల్లకోటు ధరించి న్యాయమూర్తిగా నిలువాలనే లక్ష్యంతో కష్టపడి చదివి జడ్జి పరీక్ష రాసి ఎంపికై ంది. తండ్రి వెంకటేశ్ సీసీసీ కార్నర్‌లో తోపుడు బండిపై పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు అమ్మాయిలైన కూడా వారిని బాగా చదివించి ఉన్నత స్థాయిలో నిలుపాలనే తన ఆకాంక్షను పెద్ద కూతురు నెరవేర్చడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. న్యాయమూర్తి కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివినట్లు లిఖిత పేర్కొంది. ఈ సందర్భంగా లిఖితకు స్థానిక మాజీ కౌన్సిలర్ మేకల దాసు, నాయకులు అభినందనలు తెలిపారు.


