తలమడుగు: తపాలా శాఖకు చెందిన నిధులను దుర్వినియోగం చేసిన ఘటనలో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌ను శనివారం రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ కే.ఫణిదర్ తెలిపారు. మండలంలోని రుయ్యడి గ్రామానికి చెందిన గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అబ్దుల్ నిజాం రూ.2,12,033 తన వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నాడన్నారు. పోస్టల్ ఇన్‌స్పెక్టర్ నాగిరెడ్డి రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులకు గాయాలు
వేమనపల్లి: మండలంలోని నీల్వాయి కొత్తగూడెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులకు తీవ్ర గాయాల్యయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చల్ల కుమార్ తన తల్లి లచ్చక్కతో కలిసి శనివారం కోటపల్లి మండలం నాగంపేటకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. నీల్వాయి కొత్తగూడెం సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. చెన్నూర్ మండలం నారాయణపూర్‌కు చెందిన ఆత్రం ప్రశాంత్ మద్యంమత్తులో అజాగ్రత్తగా కారు నడిపి మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. కుమార్, లచ్చక్కలకు తీవ్ర గాయాలు కాగా 108 అంబులెన్స్‌లో మంచిర్యాల ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
మరో ప్రమాదంలో..
మండలంలోని కల్మలపేట చర్చి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు మోటారుసైకిళ్లు ఢీకొనడంతో ముల్కలపేటకు చెందిన డోలె అశోక్, నీల్వాయికి చెందిన శంకర్, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు ఏఎస్సై అమానుల్లాఖాన్ తెలిపారు. క్షతగాత్రులను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారని, ఫిర్యాదు అందలేదని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
లింగాపూర్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. సిర్పూర్(యు) మండలంలోని రుద్రకాసకు చెందిన ఆత్రం భీంరావ్, లక్ష్మణ్, శంకర్ శనివారం ద్విచక్ర వాహనంపై ఆసిఫాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తుండగా జైనూర్ మండలంలోని జామ్ని గ్రామ సమీపంలో అడవిపంది అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడ్డారు. ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను జైనూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పైలట్ కొమురయ్య, టెక్నీషియన్ రజనీకాంత్ తెలిపారు.


