మంచిర్యాలక్రైం: భార్య మందలించిందని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. సీఐ ప్రమోద్ రావు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ ఏరియాలో నివాసముంటున్న తౌటి సురేష్ (37) కొంతకాలంగా పనికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. శనివారం తెల్లవారుజామున అతని భార్య మమత ఏదైనా పనికి వెళ్లమని చెప్పడంతో ఆమెతో గొడవపడ్డాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చి అద్దెకు ఉంటున్న భవనం మూడో అంతస్తు పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని సోదరుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు.
పురుగుల మందు తాగి ఒకరు..
భీమిని: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కోటేశ్వర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఖర్జిభీంపూర్‌లో కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న కారెంగుల రవీందర్ (34) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఈక్రమంలో శనివారం పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్య శ్రీవిద్య, కుమారుడు విష్ణు ఉన్నారు. మృతుని తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
వివాహం కావడం లేదని యువకుడు..
కౌటాల: వివాహం కావడంలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై డి.చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు కౌటాలకు చెందిన దుర్గం కిరణ్ (36) శనివారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గ్రామ సమీపంలోని వ్యవసాయ చేనులో మృతదేహాన్ని గుర్తించారు. పెళ్లి కావడంలేదని మానసిక ఒత్తిడికి గురై గుర్తు తెలియని విషపదార్థం సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతునికి తండ్రి, ఇద్దరు సోదరులు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.


