చెన్నూర్: చెన్నూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని డెటాల్ సేవించి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కలకలం రేపింది. గత నెల 25న ఏడోతరగతి విద్యార్థిని శ్రీహిందు పాఠశాలలో గడ్డి మందు తాగగా చికిత్స పొందుతూ 29న మృతిచెందిన విషయం తెలిసిందే. పది రోజులు గడువక ముందే అదే పాఠశాలకు చెందిన మరో విద్యార్థిని డెటాల్ తాగడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, పాఠశాల సిబ్బంది, వైద్యులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. జైపూర్ మండలం నర్వ గ్రామానికి చెందిన విద్యార్థిని పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తన గదిలో ఉన్న స్నేహితురాలితో గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో బాత్‌రూమ్‌కు వెళ్లి డెటాల్ తాగింది. పాఠశాల సిబ్బంది వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. సీఐ బన్సీలాల్ పాఠశాలకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లా ఉన్నతాధికారులు పాఠశాలలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


