ఆదిలాబాద్‌రూరల్: ఈ నెల 5న మంచిర్యాల మార్క్స్ భవన్ బస్టాండ్ వెనుకాల నిర్వహించనున్న ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) జాతీయ, రాష్ట్ర కమిటీల ఉద్యమ సహచరుల ఐక్యత విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మావల మండలంలోని కుమురంభీంగూడలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు తుడుం దెబ్బ సంఘాల జాతీయ, రాష్ట్ర కమిటీల బాధ్యులు, సభ్యులు, అనుబంధ సంఘాల రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు అధికసంఖ్యలో హాజరు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర కమిటీల ఉద్యమ సంస్థల బాధ్యులు కోట్నాక్ విజయ్‌కుమార్, వట్టం ఉపేందర్, మైపతి అరుణ్‌కుమార్, ఈసాం సుధాకర్, కల్తి సత్యనారాయణ, ఉద్యమ సహచరులు అందరూ ఒకే గొడుగు కిందకు వచ్చి పనిచేయాలని గతంలో నిర్ణయించినట్లు తెలిపారు. తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్, విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సలాం వరుణ్, ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు ఆత్రం గణపతి, నాయకులు వేడమ ముకుందరావు, తొడసం ప్రకాశ్ తదితరులున్నారు.
120 కిలోల బండరాయిని ఎత్తిన సర్పంచ్ గజేందర్, ఎల్లమ్మల గజేందర్
హనుమాన్ జయంతి, మహాదేవుని పౌర్ణమిని పురస్కరించుకుని కుంటాల మహాదేవుని ఆలయం వద్ద గురువారం రాత్రి బండరాయిని ఎత్తే పోటీలు నిర్వహించారు. 80 కేజీలు, 120 కేజీల బరువు గల బండరాయి ఎత్తే పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సర్పంచ్ జక్కుల గజేందర్, ఎల్లమ్మల గజేందర్ 120 కేజీల బండరాయిని అలవోకగా ఎత్తి సత్తా చాటారు. వీరిని గ్రామస్తులు అభినందించి సన్మానించారు. అనంతరం మహాదేవుని ఆలయ జెండాలను భాజాభజంత్రీలతో ఊరేగింపుగా తీసుకుని ఆలయం వద్ద ప్రతిష్ఠించారు. ఉప సర్పంచ్ పరికిపండ్ల రమణ, ఆలయ అర్చకుడు జంగం మధు తదితరులున్నారు. – కుంటాల
ఆకట్టుకున్న బండరాయి ఎత్తే పోటీలు


