ఇంద్రవెల్లి: మ్యాక్స్ ట్రాలీని వెనుక నుంచి ద్విచక్ర వాహనంతో ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం పిప్రి గ్రామానికి చెందిన ఆ త్రం లోకేశ్ (20) అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు కినక ప్రేమిత్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై దనోరా (బి) గ్రామానికి వెళ్లాడు. తిరిగి రాత్రి ఇంటికి వస్తున్న సమయంలో దనోరా (బి) గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పిప్రి గ్రామ చౌక్ వద్ద ఇంద్రవెల్లి వైపు నుంచి వస్తున్న మ్యాక్స్ ట్రా లీని వేగంగా వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న ఆత్రం లోకేశ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందా డు. వెనుక కూర్చున్న అతడి స్నేహితుడు ప్రేమిత్‌కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ప్రేమిత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు అతడి కుటుంబీకులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. చేతికు అందివచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోధించారు.
విద్యుత్ తీగల చోరీ
లక్ష్మణచాంద: మండలంలోని రాచాపూర్ సమీపంలో సరస్వతి కాలువపై గ్రామానికి చెందిన రైతులు నవీన్, ముత్యం, రాందేని భీమన్న ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ మోటార్ల నుంచి విద్యుత్ తీగలను గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కోసుకువెళ్లారు. గతంలోనూ పలువురి రైతుల విద్యుత్ మోటార్ల తీగలు ఇలాగే చోరీ చేశారు. తీగలు చోరీకి గురవుతుండడంతో రైతులు భూమిలోంచి అమర్చుకున్నప్పటికీ దుండగులు వాటినీ వదలకపోవడం గమనార్హం. అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టి విద్యుత్ తీగలు చోరీ కాకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.
ఇంట్లో పట్టపగలే చోరీ
సిర్పూర్(టి): మండలకేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో గల తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. తహసీ ల్దార్ కార్యాలయం పక్కనున్న ఇంట్లో మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రూ.లక్షా 50వేల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న కౌటాల సీఐ సంతోష్‌కుమార్, సిర్పూర్(టి) ఎస్సై సాగర్ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం సేకరించాక వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.
యువకుడి హత్య
ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బంగారుగూడకు చెందిన యువకుడు హత్యకు గురయ్యాడు. ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్ తెలిపిన వివరాల ప్రకారం.. బంగారుగూడకు చెందిన వెల్చల రాజేశ్ (25), జమ్ము అలియాస్ జమీర్ మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి రాజేశ్ హత్యకు గురయ్యాడు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మృతుడు రాజేశ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


