మంచిర్యాలటౌన్: జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రాల ద్వారా ప్రజలకు అందించాల్సిన ఆరోగ్య సేవలను విస్తృత పర్చాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిత అన్నారు. ప్రజాపాలన ప్రగతి–ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 45 ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రాల వైద్య సిబ్బందితో మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ క్వాలిటీ సర్టిఫికెట్ కోసం తయారు చేసుకోవాలని, మూడు బృందాలను ఏర్పాటు చేయాలని, అన్ని ఆరోగ్య కార్యక్రమాలు అందే విధంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. మాతాశిశు సంరక్షణకు వందశాతం టీకాలు ఇప్పించడం, అసంక్రమణ వ్యాధులను గుర్తించడం, మందులు అందించి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు వివరించి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్, డెమో బుక్క వెంకటేశ్వర్, డీపీవో ప్రశాంతి, భాగ్య, ప్రవళిక, జాతీయ క్వాలిటీ మేనేజర్ రాజ్‌కుమార్, మౌనిక, అఖిల్ భాష పాల్గొన్నారు.


