ముధోల్: మండలంలోని రాంటెక్ గ్రామానికి చెందిన ముష్కు రజిత (26) ఉరేసుకుని మృతి చెందింది. ఎస్సై బిట్లా పెర్సీస్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి భర్త పోశెట్టి ఏడాది క్రితం దుబాయికి వెళ్లాడు. ఆరు నెలల క్రితం ఫోన్‌లో భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత అతడి అన్నదమ్ములు వచ్చి రజితను సముదాయించి వెళ్లారు. ఈ క్రమంలో పోశెట్టి రజితపై అనుమానం పెంచుకుని నువ్వు బతకొద్దని పదేపదే ఫోన్‌లో తిట్టేవాడు. దీంతో క్షణికావేశంలో రజిత మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరికి కొడుకు రిషితేజ, కూతుళ్లు తేజస్విని, వయశ్రీక ఉన్నారు. తల్లి చనిపోవడం, తండ్రి దుబాయిలో ఉండడంతో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


