పాతమంచిర్యాల: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అంగన్‌వాడీ, ఆశా, ఉద్యోగ, కార్మికులు వేతనాల పెంపు కోసం చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా పోలీసులతో దాడులు చేయించడం దారుణమని అన్నారు. గ్రామ పంచాయతీ, మున్సిపల్, ఐకేపీ వీవోఏలు, భవన నిర్మాణ రంగాల కార్మికులు, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న ఆందోళనలకు సీపీఎం మద్దతు ఉంటుందని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలని, ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని చెప్పారు. అమెరికా అనుసరిస్తున్న సామ్రాజ్యవాద విధానాల వల్ల ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతోందని తెలిపారు. యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారి రవికుమార్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా అభివృద్ధికి, కాళేశ్వరం ముంపు సమస్యకు, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నిధులు కేటాయించాయో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ బహిర్గతం చేయాలన్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఫైళ్ల ఆశయ్య, జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు బోడంకి చందు, అశోక్, ప్రకాష్, ఉమారాణి, మల్లేశ్వరీ, లింగన్న, రంజిత్‌కుమార్, శ్రీనివాస్, ప్రేంకుమార్ రాజారాం తదితరులు పాల్గొన్నారు.


