ట్రిపుల్‌ ఐటీ పిలుస్తోంది | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీ పిలుస్తోంది

Mar 26 2026 7:35 AM | Updated on Mar 26 2026 7:35 AM

● ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ● మే 10 వరకు గడువు ● మే 30న జాబితా విడుదల ● జూన్‌ 5 నుంచి కౌన్సెలింగ్‌

ఈనెల 18 నుంచి మే 10 వరకు దరఖాస్తుల స్వీకరణ

మే 25 వరకు దివ్యాంగులు, సైనికోద్యోగుల పిల్లలు, ఎస్సీ, స్పోర్ట్స్‌, గ్లోబల్‌ కేటగిరికి చెందినవారు..

మే 30 విద్యార్థుల ఎంపిక జాబితా, జూన్‌ తొలి విడత కౌన్సెలింగ్‌, ధ్రువపత్రాల పరిశీలన.

భైంసా: రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరంలో తొలి ప్రయత్నంలోనే పదో తరగతితోపాటు తత్సమాన పరీక్షల్లో రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆర్జీయూకేటీలో ప్రవేశాల కోసం క్యాంపస్‌ నోటిఫికేషన్‌ వెలువరించింది. బాసర ట్రిపుల్‌ఐటీలో 2026–27 సంవత్సరానికి ప్రవేశాల నోటిఫికేషన్‌ విడుదలైంది. పదో తరగతి పరీక్షలు రాసేవారు హాల్‌టికెట్ల, మొబైల్‌ నంబర్‌, ఇతర ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరేళ్ల బీటెక్‌ సమీకృత కోర్సులో చేరేందుకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. త్వరలో విడుదలకానున్న పది ఫలితాల్లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను సీట్లు భర్తీ చేస్తారు. ఆర్జీయూకేటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆమోదించిన ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు నాలుగు మార్కుల చొప్పున కలుపుతారు.

ప్రవేశ అర్హతలు..

విద్యార్థులు తొలి ప్రయత్నంలో పదో తరగతి, తత్సమాన పరీక్షలో రెగ్యులర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. డిసెంబర్‌ 31, 2026 లోపు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు మించకూడదు. ప్రత్యేక సీట్ల కింద దివ్యాంగులకు 3 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు ఎస్సీ విద్యార్థులకు ఒక శాతం, స్పోర్ట్స్‌ కోటా కింద 0.5 శాతం సీట్లను భర్తీ చేస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, అంతర్జాతీయ విద్యార్థులకు గల్ప్‌దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు అదనపు సీట్లు కేటాయిస్తారు. తెలంగాణ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఏడాదికి రూ.36 వేల ఫీజు చెల్లించాలి. ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రవేశ సమయంలో ఆరోగ్యబీమా, ఇతరాలకు సంబంధించి రూ.3500 ఇతరులకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.3 వేలు చెల్లించాలి. క్యాషన్‌ (దీనిని తిరిగి ఇస్తారు) డిపాజి ట్‌ కింద ఏ కేటగిరి అభ్యర్థులైనా రూ.2 వేలు చెల్లించాలి. ఇతర రాష్ట్రాలు, గల్ఫ్‌ దేశాల్లో పనిచేసేవారి పిల్లలు ఏడాదికి రూ.1.38 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులు రూ.3 లక్షలు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి.

మార్కులు సమానమైతే..

ట్రిపుల్‌ ఐటీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న ఇద్దరి విద్యార్థుల మార్కులు సమానమైతే వరసగా గణితం, జనరల్‌ సైన్స్‌, ఇంగ్లిష్‌, సోషల్‌లో ఎక్కువ గ్రేడ్‌ వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ ఫస్ట్‌ లాంగ్వేజ్‌లో ఎక్కువ గ్రేడ్‌ వచ్చిన వారిని ఎంపిక చేస్తారు. ఇవన్నీ సమానంగా ఉంటే హాల్‌ టికెట్‌ నంబర్‌ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.

దరఖాస్తుతో జత చేయాల్సిన పత్రాలు

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రసీదు, పదో తరగతి హాల్‌టికెట్‌, మార్కుల లిస్టు, నివాసం, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల కుల ధ్రువవీకరణ పత్రాలు, దివ్యాంగులైతే వైకల్య నిర్ధారణ పత్రాలు, సైనికోద్యోగుల పిల్లలు సంబంధిత అధికారి జారీచేసిన ధ్రువీకరణ పత్రం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులైతే సంబంధిత అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలతోపాటు, రెండు జతల యూనిఫాం, షూలు, ల్యాప్‌టాప్‌లు ఇతర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు.

బాసర ట్రిపుల్‌ఐటీ

ప్రవేశాల షెడ్యూల్‌..

అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ సేవ, మీ సేవ, టీఎస్‌ ఆన్‌లైన్‌ కేంద్రాలతో ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.450, ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు రూ.1500 చెల్లించాలి. ఒక విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ సార్లు దరఖాస్తు చేసుకుంటే చివరగా చేసుకున్న దరఖాస్తును పరిగణలోకి తీసుకుంటారు. అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ https:// www. rgukt. ac. in/ లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement