మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న పలు ఇళ్లు, భవన నిర్మాణాల్లో యజమానులు నిబంధనలు పాటించడంలేదు. ఆయా కాలనీలు, ప్రధాన రహదారుల వెంట పలువురు సెట్‌బ్యాక్ లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో రోడ్ల విస్తరణ, డ్రెయినేజీల నిర్మాణ సమయంలో ఈ నిర్మాణాలు అడ్డంకిగా మారుతున్నాయి. మున్సిపల్ అనుమతి సమయంలోనే రోడ్డు నుంచి సెట్‌బ్యాక్ తప్పనిసరిగా తీసుకుని ఇళ్లు, భవనాలు నిర్మించాల్సి ఉంది. పెద్ద భవనాలకు సెల్లార్‌లు తప్పనిసరిగా ఉండాలి. అయితే, అనుమతుల సమయంలో అధికారులు ఈ నిబంధనలు విస్మరిస్తున్నారు. దీంతో పలువురు రోడ్డు వర కు నిర్మాణాలు చేపడుతున్నారు. సెట్‌బ్యాక్ వదిలేయాల్సిన ప్రాంతం వరకు చేపట్టిన నిర్మాణాలు, రోడ్లపై నిర్మించిన మెట్లు ప్రస్తుతం రోడ్ల విస్తరణ పనులకు అడ్డంకిగా మారుతున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉన్న రోడ్ల వెడల్పును మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేపడుతుండగా, పలు భవనాలు తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆక్రమణల తొలగింపులో ఇబ్బంది
నగరంలోని మార్కెట్‌లో రోడ్ల విస్తరణకు గతేడాది స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు శ్రీకారం చుట్టారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు వెడల్పు చేసి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గాను రూ.78కోట్ల నిధులు మంజూరు చేయించి టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. గతేడాది అర్చనటెక్స్ చౌరస్తా నుంచి మార్కెట్ ఏరియాలో 60 ఫీట్లతో రోడ్డు వెడల్పులో అడ్డంకిగా ఉన్న ఆక్రమణలు తొలగించారు. ప్రస్తుతం శ్రీనివాస థియేటర్ నుంచి రైల్వేస్టేషన్ వరకు 60 ఫీట్లు, రైల్వేస్టేషన్ నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు 108 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నారు. దారి పొడవునా దాదాపు అన్ని భవనాలు సెట్‌బ్యాక్ లేకుండానే నిర్మించడంతో ఆక్రమణలు తొలగించడం ఇబ్బందిగా మారింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డు వేయాలంటే ఆక్రమణలు తప్పనిసరిగా తొలగించాల్సిందే. ప్రస్తుతం రోడ్డు వెడల్పు పనుల ప్రక్రియ వేగవంతం కాగా, ఆక్రమణల తొలగింపుతో ప్రజల రాకపోకలు ఇబ్బందిగా మారుతోంది. భవనాలకు అనుమతి ఇచ్చినప్పుడే నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నారా? లేదా? అని అధికారులు పరిశీలించి ఉంటే ప్రస్తుతం ఆక్రమణల తొలగింపు చేపట్టాల్సిన అవసరం ఉండేది కాదని, నూతనంగా నిర్మించే భవనాలైనా నిబంధనల మేరకు నిర్మించేలా చూడాలని నగర ప్రజలు కోరుతున్నారు.
నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటాం
నగరపాలక సంస్థ పరిధిలో ఇకపై నిర్మించే భవనాలు, ఇళ్లు నిబంధనల మేర కు ఉండేలా చర్యలు తీసుకుంటాం. సెట్‌బ్యాక్ వదిలేసేలా, సెల్లార్లను పార్కింగ్ కోసం వినియోగించేలా చూస్తాం. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలోని రోడ్లు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. భవన నిర్మాణాలు నిబంధనల ప్రకారం నిర్మించుకునేలా చూస్తాం. – దర్ని మధుకర్, మంచిర్యాల మేయర్


