క్రీడా పాఠశాల పిలుస్తోంది..!
4వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు షురూ ఎంపికై తే విద్యాబోధనతోపాటు క్రీడాశిక్షణ మూడు స్థాయిల్లో ఎంపిక పోటీల నిర్వహణ
30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్: 30 మీటర్ల దూరాన్ని బాలురు 4.4, బాలికలు 4.6 సెకన్లలో చేరుకోవాలి.
స్టాండింగ్ బ్రాడ్ జంప్: బాలురు 194 సెంటీమీటర్లు, బాలికలు 181 సెంటీమీటర్ల దూరం దూకాలి.
800 మీటర్ల పరుగు: బాలురు 3.06 నిమిషాల్లో, బాలికలు 3.19 నిమిషాల్లో 800 మీటర్ల దూరాన్ని చేరుకోవాలి.
6x10 మీటర్ల షటిల్ రన్: నిర్దేశించిన రెండు స్థానాల మధ్య నిర్ధిష్ట సమయంలో పరుగెత్తాల్సి ఉంటుంది. ఎక్కువ రౌండ్లు పరిగెత్తాలి. (బాలురు 16.4 సెకన్లు, బాలికలు 17.1 సెకన్లలో 10 మీటర్ల దూరాన్ని ఆరుసార్లు పరుగెత్తాలి.)
మెడిసిన్ బాల్ త్రో: నిర్దేశించిన స్థానంలో కూర్చొని బంతిని వీలైనంత ఎక్కువ దూరం విసరాలి.(బాలురు 2.77 మీటర్లు, బాలికలు 2.48 మీటర్ల దూరం బంతిని విసరాలి.)
వర్టికల్ జంప్: చిన్నారులు తాము నిలబడ్డ స్థానం నుంచి వీలైనంత ఎత్తుకు ఎగరాల్సి ఉంటుంది. (బాలురు 36 సెంటీమీటర్లు, బాలికలు 34 సెంటీమీటర్ల ఎత్తు ఎగరాలి.
ఫ్లెక్సిబిలిటీ టెస్ట్: ఈ పరీక్షలో చిన్నారులను ఒక బల్లపై నిల్చోబెడతారు. వారు చేతులతో వారి పాదాలను తాకాల్సి ఉంటుంది. మోకాళ్లు వంచకుండా ఎంత కిందకి వంగితే అంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్లు.
ఆదిలాబాద్: చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలనుకునే చిన్నారుల కోసం తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక్కడ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు, వారు ఆసక్తి చూపే క్రీడాంశాల్లో నిష్ణాతులైన శిక్షకులతో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. తాజాగా ఫిబ్రవరి 26 (గురువారం) నుంచి ఈ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.
సౌకర్యాలు..శిక్షణ..
క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు 4వ తరగతి నుంచి హకీంపేటలో అయితే ఇంట ర్మీడియట్ వరకు, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ పాఠశాలల్లో అయితే పదో తరగతి వరకు రెసిడెన్షియల్ సౌకర్యాన్ని కల్పిస్తారు. క్రీడలకు ప్రాధాన్యత నేపథ్యంలో బలవర్ధకమైన ఆహారాన్ని అందజేస్తారు. ప్రత్యేకమైన యూనిఫామ్ అందిస్తారు. విద్యార్థుల ఆసక్తులు, అభిరుచులు, సామర్థ్యాలను అనుసరించి పలు క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తారు. మెరుగైన శిక్షణతో వారిలో నైపుణ్యాలను మెరుగుపరిచి రాష్ట్ర జాతీయ, అంతర్జాతీయ పోటీల్లోనూ సత్తా చాటేలా ప్రత్యేక దృష్టి సారిస్తారు. అదేవిధంగా పాఠశాల అనంతరం విద్యార్థులకు ప్రభుత్వ క్రీడా శిక్షణ సంస్థల్లో ఎంపికయ్యేలా, క్రీడా కోటా కింద ఉద్యోగాలు సంపాదించేలా మార్గ నిర్దేశనం చేస్తారు. క్రీడా పాఠశాలలో అథ్లెటిక్స్, ఆర్చరీ, సెపక్ తక్రా, సెయిలింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, వాలీబాల్, బాక్సింగ్, యోగ, కయాకింగ్, రోయింగ్ వంటి క్రీడా విభాగాల్లో ఎంపికై న చిన్నారులకు శిక్షణ ఇస్తారు.
అర్హతలు..
నాలుగో తరగతిలో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థిని, విద్యార్థులు మూడో తరగతి ఉత్తీర్ణులై, 8 నుంచి 9 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. 01 –09 –2017 నుంచి 31 –08 –2018 తేదీలోపు జన్మించి ఉండాలి.
అవసరమైన ధ్రువపత్రాలు..
1) వయస్సు ధ్రువీకరణ, విద్యాభ్యాస ధ్రువీకరణ పత్రం (ఏజ్ –స్టడీ సర్టిఫికెట్)
2) జనన ధ్రువీకరణ పత్రం
3) పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు (10)
4) 3, 4వ తరగతి విద్యార్థి ప్రగతి నివేదికలు (ప్రోగ్రెస్ రిపోర్టులు)
5) ఆధార్ కార్డు
6) కుల ధ్రువీకరణ పత్రం
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాలటౌన్: స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి హనుమంతరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 13 నుంచి మండల విద్యాధికారి ఆధ్వర్యంలో మండలస్థాయి పోటీలు నిర్వహిస్తామని, ఎంపికై న వారికి జిల్లాస్థాయి ఎంపిక పోటీలను మార్చి 30న జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఎంపిక పోటీలు..
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీ: 26 ఫిబ్రవరి నుంచి 04 మార్చి 2026 వరకు
మండల స్థాయి ఎంపికలు: 13 మార్చి నుంచి 17 మార్చి 2026 వరకు
జిల్లాస్థాయి ఎంపికలు: 28 మార్చి నుంచి 01 ఏప్రిల్ 2026 వరకు
రాష్ట్ర స్థాయి ఎంపికలు: 27 ఏప్రిల్ నుంచి 01 మే 2026 వరకు
కౌన్సెలింగ్ తేదీ: 13 మే నుంచి 14 మే 2026
రిపోర్టింగ్ తేదీ: 12 జూన్ 2026
వెబ్‌సైట్: tgss. telangana. gov. in


