ధనమే అన్నింటికీ మూలం అంటారు పెద్దలు.. డబ్బుంటే ఏదైనా సా
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు మొదటిసారి జరిగిన ఎన్నికల్లో గెలుపొందేందుకు అభ్యర్థులు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్‌లోని 60 డివిజన్లలో 20 బీసీలకు, 30 జనరల్‌కు కేటాయించారు. మేయర్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో పోటీ చేసిన బీసీ అభ్యర్థులు ఎలాగైనా తమ డివిజన్లలో గెలవాలని శాయశక్తులు ఒడ్డారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఓటర్లను ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున విందు, మందు ఏర్పాట్లతో పాటు, ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.4 వేల వరకు పంచినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 41 స్థానాల్లో బీసీ అభ్యర్థులు పోటీలో గెలుపొందగా, అధికార కాంగ్రెస్ నుంచే 31 మంది విజేతలుగా నిలిచారు. వీరిలో మేయర్ స్థానం తమకు వస్తుందనే ధీమాతో అరకోటికి పైగానే ఖర్చు చేసినట్లు సమాచారం. బీజేపీ నుంచి ముందుగానే మేయర్ అభ్యర్థిని ప్రకటించగా 58 స్థానాల్లో అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో సైతం ఒకరిద్దరు అరకోటికి పైగానే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.
మేయర్ స్థానం వస్తుందనే
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో మేయర్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీసీ అభ్యర్థులు కార్పొరేటర్‌గా గెలిచేందుకు ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచే మేయర్ స్థానం కోసం పోటీ పడిన వారిలో అరకోటికి పైగానే ఎన్నికల్లో ఖర్చు చేశారు. ఒక్కసారి మేయర్ అయితే భవిష్యత్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఉండడంతో ఖర్చుకు వెనకాడలేదని తెలుస్తోంది. పాతమంచిర్యాల ప్రాంతంలో పోటీ చేసిన ఓ అభ్యర్థి ఏడాది ముందు నుంచే ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులను చేపట్టడంతో పాటు, కాలనీ ప్రజలకు నీటి సమస్య తీర్చేందుకు ఏడు బోర్లు సైతం వేయించారు. ఎన్నికల ఖర్చుతో పాటు, అభివృద్ధి పనులకే దాదాపుగా కోటి వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. మరికొందరు అభ్యర్థులు ఆలయం అభివృద్ధి పేరిటనే లక్షల రూపాయలు అందించారు. నస్పూర్ ప్రాంతంలోని ఇద్దరు అభ్యర్థులు మేయర్ పదవి తమకు ఎలాగైనా వస్తుందనే ధీమాతో ఎన్నికల్లో దాదాపుగా 60 లక్షలకు పైగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ అభ్యర్థుల్లో ప్రధాన పార్టీలకు చెందిన వారికి ఒక్కొక్కరికి రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసినా కొందరు విజయం సాధించలేక పోయారు. వైశ్యభవన్ సమీపంలోని ఓ డివిజన్ అభ్యర్థి ఎన్నికలకు ఒకరోజు ముందే దాదాపుగా రూ.30 లక్షల వరకు ఓటర్లకు పంపిణీ చేయడంతో విజయం సాధించినట్లు డివిజన్ ప్రజలు చర్చించుకుంటున్నారు.
లక్సెట్టిపేట: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గెలుపుకోసం భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని వార్డుల్లో పోటీ త్రీవత ఎక్కువగా ఉండడంతో డబ్బులతో పాటు దావత్‌లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో 11 కాంగ్రెస్, 3 బీఆర్‌ఎస్, 1 బీజేపీ కై వసం చేసుకున్నాయి. రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపు సాధించారు. ఇందుకు రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మూడో వార్డులో కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ అభ్యర్థి రూ.15 నుంచి రూ.20 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఓటమి పాలయ్యారు. ఎనిమిదో వార్డులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు సుమారు ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 14వ వార్డులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఒక్కో అభ్యర్థి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని వార్డుల్లో అభ్యర్థులు ఎన్నికల ఖర్చులకోసం తమ ప్లాట్‌లను అమ్మినట్లు తెలుస్తోంది.
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీలో 18 వార్డులకు 107 మంది బరిలో నిలిచారు. ఒక్కో వార్డుకు 5 నుంచి 8 మంది వరకు పోటీలో నిలిచారు. ఒక్కో వార్డులో 800 వందల నుంచి 1200 వరకు 18 వార్డుల్లో 19,903 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీలోని కొన్ని వార్డులకు చెందిన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా రూ.30 నుంచి రూ.35 లక్షలు ఖర్చు చేసినా ఓటమి పాలయ్యారని చర్చ జరుగుతోంది.
చైర్మన్ పదవిపై ఆశతో..
చెన్నూర్ మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. ఆరు స్థానాలు బీసీ మహిళకు రిజర్వేషన్‌కాగా మరో రెండు జనరల్ వార్డుల నుంచి బీసీ మహిళలను బరిలోకి దింపారు. ముఖ్యంగా చైర్‌పర్సన్ సీటుపై కన్నేసిన అభ్యర్థులే ఓటమిపాలు కావడం గమనార్హం. ఆరు బీసీ మహిళా రిజర్వేషన్ల స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు సుమారు రూ.2 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయినా ఓటర్లు వారికి నచ్చిన వారికే పట్టం కట్టారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
అభ్యర్థుల విజయాన్ని శాసించిన ధనబలం
బెల్లంపల్లి: మున్సిపల్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా ధన ప్రవాహం ఉరకలెత్తింది. ఒక్కో అభ్యర్థి కనిష్టంగా రూ.20 లక్షల నుంచి గరిష్టంగా 50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. చైర్ పర్సన్ పదవిని జనరల్ మహిళకు రిజర్వు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు, బీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు తమ భార్యలను పోటీకి దింపి ఖర్చుకు వెనుకాడకుండా తలపడ్డారు.
అభ్యర్థుల ఖర్చు ఇలా...
మున్సిపల్ రాజకీయాల్లో తొలిసారిగా అరంగ్రేటం చేసిన ఓ యువకుడు దాదాపు రూ.50 లక్షల వరకు ఖర్చు చేసి కౌన్సిలర్‌గా విజయం సాధించాడు. ఓ తాజా మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భార్య ను పోటీలో నిలబెట్టి గరిష్టంగా 45 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ పక్షాన పోటీ చేసిన ఓ మహిళ చైర్‌పర్సన్ సీటుపై గురిపెట్టి దాదా పు రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారంలో ఉంది. కాంగ్రెస్ నుంచి తన సతీమణిని పోటీ చేయించిన ఓ నాయకుడు రూ.30 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియ ర్ నాయకుడు తన భార్యను పోటీలో నిలబెట్టి సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు చేసి గెలిపించుకున్నాడు. ఓ సీనియర్ మాజీ కౌన్సిలర్ తన రాజకీయ వారసురాలిని పోటీలో నిలబెట్టి రూ.30 లక్షల వరకు ఖర్చు చేశాడు. కానీ ఆమె ఓటమి పాలైంది. ఓ మాజీ కౌన్సిలర్ రాజకీయ ఓనమాలు తెలియని ఓ మహిళను పోటీ చేయించి రూ.30 లక్షల వరకు ఖర్చు చేశాడు. కానీ ఓటర్లు ఆమెను ఓడించారు. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు తన భార్యను చైర్‌పర్సన్ చేయడానికి పోటీ చేయించి రూ.20 లక్షల వరకు ఖర్చు చేయగా ఆమె ఓడిపోయారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఓ మాజీ కౌన్సిలర్ తన భార్యను పోటీ చేయించి రూ.25 లక్షలు ఖర్చు చేసి గెలిపించుకున్నాడు. ఓ సామాజికవర్గానికి చెందిన యువకుడు ఎన్నికల్లో పోటీ చేసి రూ.25 లక్షల వరకు ఖర్చు చేసి గెలుపొందాడు. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తన భార్యను ఎన్నికల్లో పోటీ చేయించి రూ.20 లక్షలకు పైగా ఖర్చు పెట్టి గెలిపించుకున్నాడు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఓ అభ్యర్థి తన గెలుపుకోసం రూ.25 లక్షలు ఖర్చు చేసి జయకేతనం ఎగుర వేశాడు. అసంఘటిత రంగానికి నాయకత్వం వహిస్తున్న ఓ యువనాయకుడు తన భార్యను పోటీ చేయించి రూ.20 లక్షలు ఖర్చు చేసినా ఆమె ఓడిపోయారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఓ యువకుడు రూ.20 లక్షలకుపైగా ఖర్చు చేసి ఓడిపోయాడు.
అభ్యర్థుల ఖర్చు అరకోటి పైనే
అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రం
అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి
ధనమే అన్నింటికీ మూలం అంటారు పెద్దలు.. డబ్బుంటే ఏదైనా సా


