ఈ పీడీ.. హాకీలో మేటి..
ఆదిలాబాద్: ఆయనో వ్యాయామ ఉపాధ్యాయుడు..చిన్నారులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడం ఆయన బాధ్యత.. వీటిని విజయవంతంగా నిర్వర్తిస్తున్నా..తనను గొప్పస్థాయిలో నిలబెట్టిన ఆటను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. చిన్ననాటి నుంచే హాకీపై మక్కువ పెంచుకొని, ఆ ఆటలో నిష్ణాతుడిగా ఎదిగి, ప్రస్తుతం జాతీయస్థాయి క్రీడాకారుడిగా సత్తా చాటుతున్నాడు. ఓవైపు బోథ్ మండలం మర్లపెలి్‌ల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పీడీగా ఉద్యోగ బాధ్యతలు చేపడుతూ, ఇప్పటికీ నాలుగుసార్లు సివిల్ సర్వీసెస్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం విశేషం. మరోవైపు ఎంతోమంది విద్యార్థులను క్రీడా మెరికలుగా మలుస్తూ.. తాను సైతం మేటి క్రీడాకారుడిగా రాణిస్తున్న జిల్లాకు చెందిన హాకీ స్టార్ షబ్బీర్ అలీపై కథనం.
చిన్ననాటి నుంచే..
జిల్లాకేంద్రానికి చెందిన షబ్బీర్ అలీ హాకీపై ఇష్టంతో ఆరో తరగతి నుంచే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సాధన చేస్తున్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు ఐదు జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాడు. అండర్–19 విభాగంలో మధ్యప్రదేశ్‌లోని తికంగర్ వేదికగా జరిగిన టోర్నీలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అదేవిధంగా అండర్–16 విభాగంలో హర్యానాలోని ఫరీదాబాద్ వేదికగా జరిగిన జాతీయస్థాయి పోటీల్లో, చైన్నె, చిదంబరం వేదికగా యూనివర్సిటీ జాతీయస్థాయి పోటీల్లో మూడుసార్లు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించి మంచి క్రీడాకారుడిగా గుర్తింపు దక్కించుకున్నాడు.
ఉద్యోగిగానూ..
2012లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా ఎంపికై న షబ్బీర్ అలీ..హాకీ ఆటను మరింతగా మెరుగుపరుచుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే క్రీడా పోటీల్లోనూ రాష్ట్రం తరఫున జాతీయస్థాయికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉద్యోగులతోపాటు తాను శిక్షణనిచ్చే భవిష్యత్తు క్రీడాకారులకు స్ఫూర్తిమంత్రంగా నిలుస్తున్నాడు. 2017లో మొదటిసారి ఝార్ఖండ్ రాజధాని రాంచీ వేదికగా జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నీకి ఎంపికయ్యాడు. 2018లో చత్తీస్‌ఘఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్ వేదికగా జరిగిన టోర్నీలో రెండోసారి, 2023లో హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర వేదికగా మూడోసారి రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా న్యూఢిల్లీ వేదికగా ఈనెల 17 నుంచి 28వ తేదీ వరకు జరగనున్న పోటీల్లో రాష్ట్రం తరఫున మరోసారి బరిలోకి దిగుతున్నాడు.


