పీఎంశ్రీ విద్యార్థులకు అల్పాహారం
పాఠశాలలకు నిధులు మంజూరు చేసిన కేంద్రం హర్షం వ్యక్తం చేస్తున్న పదో తరగతి విద్యార్థులు ఒక్క విద్యార్థికి రోజుకు రూ.15 కేటాయింపు ఉమ్మడి జిల్లాలో 4,760 మందికి లబ్ధి
లక్ష్మణచాంద:ప్రభుత్వ పాఠశాలల అభివద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో సౌకర్యాలకు నిధులు కేటాయిస్తున్నాయి. ఇటీవలే మరుగుదొడ్లు, కిచెన్‌షెడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. తాజాగా ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ)పథకంలో ఎంపికై న పాఠశాలల్లో కేంద్రం మౌలిక వసతులు కల్పిస్తోంది. తరగతి గదులతోపాటు, మూత్రశాలలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్ వంటి సౌకర్యాలను సమకూరుస్తోంది. తాజాగా పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులకు అల్పాహారం కోసం నిధులు కేటాయించింది.
34 రోజుల ప్రణాళిక
ఈ నెల 28 నుంచి వచ్చే నెల 14 వరకు 34 రోజులు ప్రతీ విద్యార్థికి రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున రూ.510 విలువైన అల్పాహారం అందిస్తారు. ప్రత్యేక తరగతుల సమయంలో ఉదయం, సాయంత్రం అల్పాహారం అందిస్తారు. జిల్లా విద్యా శాఖ అధికారుల ప్రకారం, అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇది అమలు చేస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం 19 రోజుల ప్రణాళిక..
రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే పదో తరగతి విద్యార్థుల కోసం 19 రోజులపాటు అల్పాహారం అందించేందుకు నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులకు నిధులు మంజూరయ్యాయి. దీంతో విద్యార్థులకు ఆకలి బాధలు తొలగిపోయి చదువుపై మరింత దృష్టి కేంద్రీకరించి ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో 4,760 మందికి లబ్ధి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలలు 51 ఉన్నాయి. నిర్మల్, కుమురంభీం జిల్లాల్లో 10 చొప్పున, మంచిర్యాల జిల్లాలో 16, ఆదిలాబాద్ జిల్లాలో 15 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 4,760 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి చదువుతున్నారు. వీరికి రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున అల్పాహారం కోసం ఖర్చు చేస్తారు.
ఉమ్మడి జిల్లా సమాచారం...
నిర్మల్ జిల్లా ...
పీఎంశ్రీ పాఠశాలలు: 10
‘పది’ విద్యార్థుల సంఖ్య: 795
మంజూరైన నిధులు: రూ.4,05,450
ఆదిలాబాద్ జిల్లా...
పీఎంశ్రీ పాఠశాలలు:15
విద్యార్థుల సంఖ్య; 1943
మంజూరైన నిధులు; రూ.9,90,923
కుమురం భీం జిల్లా...
పీఎంశ్రీ పాఠశాలలు:10
విద్యార్థుల సంఖ్య: 928
మంజూరైన నిధులు:రూ.4,73,280
మంచిర్యాల..
పీఎంశ్రీ పాఠశాలలు:16
విద్యార్థులు: 1094
మంజూరైన నిధులు: రూ.5,57,940


