ఆశలు చిగురించేనా?
చెన్నూర్‌రూరల్: ఈ ఏడాది మామిడి చెట్లకు పూత జనవరిలోనే అధికంగా వచ్చింది. దీంతో రైతుల్లో ఆ నందం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమా రు 18 వేల ఎకరాలకు పైగా మామిడి తోటలు సా గు చేస్తున్నారు. బెల్లంపల్లి, నెన్నెల, ఆవుడం, చిత్తాపూర్, భీమారంతోపాటు చెన్నూర్ మండలంలోని ఎర్రగుంటపల్లి, కొమ్మెర, ఆస్నాద, బుద్దారం,సంకారం, కన్నెపల్లి, సుద్దాల,కమ్మరిపల్లి, గంగారం, త దితర గ్రామాల్లో ఎక్కువ మొత్తంలో సాగవుతోంది.
ప్రకృతి కరుణిస్తేనే..
డిసెంబర్ నెల చివరి నుంచి మామిడి పూత రావాల్సి ఉంటుంది. ఈ ఏడాది అలాగే పూత అధికంగా వచ్చింది. మామిడి చెట్లకు తేనె మంచు పురుగు ఆశించకుండా రైతులు పురుగు నివారణకు మందులను స్ప్రే చేస్తున్నారు. అలాగే మామిడి చెట్లకు పూత నుంచి పిందెలు వస్తున్నాయి. మార్చి, ఏప్రిల్ మే నెలల వరకు ప్రకృతి కరుణిస్తే వచ్చిన పిందెలు రాలిపోకుండా పెరుగుదల ఉంటుంది. మే నెల వరకు కాయలు పూర్తిగా ఎదిగి రైతులకు ఆశించిన దిగుబడి వస్తాయి. కానీ ఏటా ఈదురుగాలులు, అకాలవర్షాలతో కాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాకుండా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటే పిందె దశకు చేరుకునే సమయానికి కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తోటలకు ఏ పరిస్థితుల్లో ఎలాంటి మందులు పిచికారి చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అని తెలియజేయాలని రైతులు అంటున్నారు. అలాగే ఏటా గాలులు, అకాలవర్షాలతో మామిడి కాయలు నేలరాలిపోతున్నా, నష్టపరిహారం అందడం లేదు. దీనికి తోడు మామిడి కాయలు అమ్మేందుకు మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో యజమానులు తోటలను కౌలుకు ఇస్తుంటారు. కొంత డబ్బును ముందుగా యజమానులకు ఇచ్చి, పంట పూర్తిగా చేతికి రాగానే మిగతా డబ్బు అందిస్తారు.


