‘భూములు లాక్కుంటే ఊరుకోం’
నెన్నెల: అడవుల అభివృద్ధి పేరుతో గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర నేత కొయ్యల ఏమాజీ హెచ్చరించారు. ఆదివారం మండలంలోని చిత్తాపూర్‌లో పార్టీ మండలాధ్యక్షుడు అంగలి శేఖర్‌తో కలిసి గిరిజన కుటుంబాలతో మాట్లాడారు. చిత్తాపూర్‌లో 82మంది గిరిజనులు 30ఏళ్లుగా సాగు చేస్తున్న భూములను అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా లాక్కున్నారని ఆరోపించారు. 20మంది గిరిజన రైతుల మీద అక్రమ కేసులు నమోదు చేసి కోర్టుకు పంపడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేసులు ఎత్తివేయాలని, పోడు భూములకు పట్టాలిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు న్యాయం జరిగేదాకా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇటీవల సర్పంచ్‌గా గెలుపొందిన ఒడం కమల–మల్లయ్య, ఉపసర్పంచ్ వెంకటేశ్‌ను శాలువాలతో సన్మానించారు. నాయకులు గోవర్ధన్, శ్రావణ్‌కుమార్, నర్సింగ్, యాదగిరి, శ్రీనివాస్‌గౌడ్, షఫీ తదితరులు పాల్గొన్నారు.


