కాంగ్రెస్‌, సీపీఐ పొత్తు కుదిరేనా? | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, సీపీఐ పొత్తు కుదిరేనా?

Jan 26 2026 5:03 AM | Updated on Jan 26 2026 5:03 AM

కాంగ్రెస్‌, సీపీఐ పొత్తు కుదిరేనా?

కాంగ్రెస్‌, సీపీఐ పొత్తు కుదిరేనా?

● పార్టీల మధ్య కుదరని ఏకాభిప్రాయం ● కాంగ్రెస్‌లో కనిపించని సానుకూలత ● సీపీఐలో వ్యక్తమవుతున్న అసంతృప్తి ● బల్దియాల్లో ఒంటరి పోరు తప్పదా?

బెల్లంపల్లి: జిల్లాలో త్వరలో నిర్వహించనున్న ము న్సిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌, సీపీఐ మధ్య పొత్తుపై సందిగ్ధత నెలకొంది. రెండు పార్టీలు కలిసికట్టుగా పురపోరుకు సిద్ధమవుతాయా? లేదా అనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్‌ నుంచి సరైన సానుకూలత వ్యక్తం కావడం లేదనే అసంతృప్తి సీపీఐ నేతల్లో వ్య క్తమవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు పార్టీల మధ్య భావసారూప్యత ఏర్పడి సత్ఫలితాలు సాధించగా.. ప్రస్తుతం ఆ సయోధ్య లేదు.

ఇరుపార్టీల బలాబలాలు

జిల్లాలో మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు బెల్లంపల్లి, క్యాతనపల్లి, చెన్నూర్‌, లక్సెట్టిపేట మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగనున్నాయి. కోల్‌బెల్ట్‌ ప్రాంతాల్లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ)కు పట్టుంది. మందమర్రి ఎంపీపీ స్థానాన్ని మూడుసార్లు, క్యాతనపల్లి మేజర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌ పదవి రెండు పర్యాయాలు గతంలో గెలుచుకున్న చరిత్ర సీపీఐకి ఉంది. మంచిర్యాల కార్పొరేషన్‌లో విలీనమైన నస్పూర్‌ బల్దియాలో గత ఎన్నికల్లో రెండు వార్డుల్లో విజయం సాధించగా.. బెల్లంపల్లి మున్సిపాల్టీలోనూ రెండు వార్డుల్లో గతంలో ప్రాతినిధ్యం వహించింది. తాజాగా రాజకీయ సమీకరణలు కొంత మారినప్పటికీ ప్రత్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే శక్తి ఎర్రజెండా పార్టీకి ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జిల్లాలోని బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని బలంగా ఉంది. ఏ పార్టీ మద్దతు లేకుండా పోటీ చేసే సత్తా కూడా హస్తం పార్టీకి ఉంది.

రెండు చోట్ల ప్రాథమిక చర్చలు

బెల్లంపల్లి, క్యాతనపల్లి మున్సిపాల్టీల్లో ఇటీవల కాంగ్రెస్‌, సీపీఐ క్షేత్రస్థాయి నాయకుల మధ్య ప్రాథమికంగా పొత్తులపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. బెల్లంపల్లిలో సీపీఐ ఆరు వార్డులు ఆశిస్తుండగా రెండు, క్యాతనపల్లిలో ఎనిమిది వార్డులు డిమాండ్‌ చేస్తుండగా నాలుగు కేటాయించడానికి కాంగ్రెస్‌ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇరుపక్షాల మధ్య ఇంకా ఎలాంటి అంగీకారం కుదరలేదని సమాచారం. మంచిర్యాల కార్పొరేషన్‌లో సీట్ల పంపకాలకు ఇంకా ముందడుగు పడలేదు. చెన్నూర్‌లో పొత్తు కుదరాల్సి ఉంది.

పొత్తు కుదరకపోతే..

పొత్తు కుదరకపోతే సీపీఐ ఒంటరి పోరా టానికి సిద్ధపడే అవకాశాలున్నాయి. పొత్తు అంశం తేల్చకుండా అధికారంలోకి రాకముందు ఓ తీరు.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరో తీరుగా కాంగ్రెస్‌ నాయకులు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం సీపీఐ నా యకుల్లో వ్యక్తమవుతోంది. అవకాశము న్న ప్రతీ వార్డులో పోటీ చేసేందుకు సూత్రప్రాయంగా సీపీఐ నిర్ణయించినట్లు తెలు స్తోంది. మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధి నస్పూర్‌ ప్రాంతంలో దాదాపు 22 డివిజన్లు, క్యాతనపల్లిలో 22 వార్డులు, బెల్లంపల్లిలో 10వార్డులు, చెన్నూర్‌లో ఓ వార్డులో పోటీ చేయనున్నట్లు సమాచారం. కామ్రేడ్లతో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధపడుతుందా..? ఒంటరిగా పోటీ చేసి పాగా వేయాలని భావిస్తుందా? అనేది తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement