సింగరేణి పరిరక్షణకు కలిసి రావాలి
శ్రీరాంపూర్: సింగరేణి ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉందని, పరిరక్షణకు అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షు డు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నస్పూర్ కాలనీలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త గనులు రాకపోవడం వల్ల భవిష్యత్ అంధకారంగా మారిందని, గత పాలకులు కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయలేదని, కంపెనీలో రాజకీయ జోక్యం పెరిగి అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థను కాపాడుకోవడానికి అన్ని కార్మిక సంఘాలు కలిసి ఐక్యంగా పోరాడాలని అన్నారు. తెలంగాణ పరిధిలోని బొగ్గుబ్లాకులను సింగరేణికే కేటా యించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 41బొగ్గుబ్లాకుల వేలానికి పిలిచిందని, ఇతర కంపెనీలు పాల్గొనకుండా అడ్డుకుని సింగరేణికే దక్కేలా పోరాడాలని అన్నారు. ఈ సమావేశంలో యూ నియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, సహాయ కార్యదర్శి కొమురయ్య, నాయకులు అఫ్రోజ్ ఖాన్, నర్సింగరావు, అనంతరె డ్డి, పరుశురాం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


