చదును పేరిట మట్టిదందా
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేటలో ప్రభుత్వ వైద్య కళాశాలలో చదును పేరిట అక్రమ మట్టిదందా సాగుతోంది. కళాశాల నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ మట్టిదందాకు తెరతీశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. మట్టిని లారీకి రూ.రెండు వేల చొప్పున అమ్ముకుంటున్నారని, గత కొన్ని రోజులుగా సాగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రశ్నించే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మంగళవారం మాజీ ఎంపీటీసీ ఒడ్డె బాలరాజు, స్థానిక గ్రామస్తులు వైద్య కళాశాలలోకి వెళ్లి సదరు కాంట్రాక్టర్‌ను నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదన చోటు చేసుకుంది. స్థానిక రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారుల దృష్టి సారించకపోవడంతో మట్టిని అమ్ముకుంటున్నారని, సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


