‘చివరి’ విజేతలెవరో..!
నేడు మూడో విడత ఎన్నికలు ఐదు మండలాల్లో పోలింగ్ 98 గ్రామాల్లో 390 మంది సర్పంచ్ అభ్యర్థులు నేటితో ముగియనున్న పంచాయతీ ఎన్నికల పర్వం
చెన్నూర్: జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం చెన్నూర్, మందమర్రి, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఆయా మండలాల్లో 102 గ్రామ పంచాయతీలు ఉండగా.. చెన్నూర్ మండలం రచ్చపల్లి, కోటపల్లి మండలం ఎసాన్‌వాయి, లక్ష్మిపూర్, మందమర్రి మండలం శంకర్‌పల్లి సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 98 గ్రామ పంచాయతీల్లో 390మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 868 వార్డు స్థానాలకు గాను 153 ఏకగ్రీవం కాగా.. మిగతా 711 స్థానాల్లో 1,905మంది బరిలో ఉన్నారు. ఆయ మండలాల్లో వార్డు సభ్యుల స్థానాలకు పోటీ తీవ్రంగా ఉండడంతోపాటు సర్పంచ్ అభ్యర్థుల ఫలితాలు వెల్లడయ్యే వరకు అర్ధరాత్రి అయ్యే అవకాశం లేకపోలేదు.
ఎన్నికల సామగ్రి పంపిణీ
ఆయా మండలాల్లోని మండల పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఎన్నికల అధికారులు, సిబ్బందికి పోలింగ్ సామగ్రి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల ఉత్తర్వులు కాపీలు పంపిణీ చేశారు. చెన్నూర్‌లోని పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా ఎన్నికల పరిశీలకులు మోహన్‌రెడ్డి, డీపీవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో శ్రీనివాస్ సందర్శించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం పోలింగ్ అధికారులు, సిబ్బంది పోలీసు బందోబస్తు మధ్య ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. పోలింగ్ సిబ్బంది తరలింపు కోసం 59 బస్సులు, 19 కార్లు, 9 టాటాఏస్ వాహనాలు సమకూర్చారు. 999 ప్రీసైడింగ్ అధికారులు(పీవోలు), 1092 ఓపీవోలు, 99 మంది స్టేజ్–2 ఆర్వోలు, ఇద్దరు మైక్రో అబ్జర్వర్లు, 18 మంది వెబ్ కాస్టింగ్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు.
1,06,889 మంది ఓటర్లు
చెన్నూర్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 1,06,889 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జైపూర్ మండలంలో అత్యధికంగా 30,622 మంది ఓటర్లు ఉండగా.. మందమర్రి మండలంలో అత్యల్పంగా 11,127 మంది ఓటర్లు ఉన్నారు. మందమర్రి మండలంలో తక్కువ ఓటర్లు ఉండడం వల్ల తొలి ఫలితం ఇక్కడే వెలువడే అవకాశం ఉంది. నియోజకవర్గంలోని గ్రామీణ ఓటర్లలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. కాగా, బుధవారం జరిగే ఎన్నికలతో జిల్లాలో మూడు విడతలుగా సాగిన పంచాయతీ ఎన్నికల పర్వం ముగియనుంది.
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
నస్పూర్: పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పోలింగ్, మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుందని తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, సిబ్బందికి అసౌకర్యాలు కలుగకుండా అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు.
‘చివరి’ విజేతలెవరో..!
‘చివరి’ విజేతలెవరో..!


